Home

»

Latest News

‘నిరసన ఇప్పుడు ఒక కొత్త వృత్తి’.. ఈ వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో దాడి.. బ్ర‌హ్మాజీ రెస్పాన్స్‌.!

Oct 16, 2026 11:39AM

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దేశంలో జరుగుతున్న నిరసనలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తాజాగా మరో పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని వివరించారు. ఇంతకీ బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఆయన ఇచ్చిన వివరణలో ఏముంది?

దేశంలో వివిధ సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో బ్రహ్మాజీ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా నీట్ పరీక్షకు సంబంధించిన నిరసనలు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలను ఉద్దేశించి.. “నిరసన ఇప్పుడు ఒక కొత్త వృత్తి” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కామెంట్స్ చేశారు.

తన వ్యాఖ్యలపై విమర్శలు పెరగడంతో బ్రహ్మాజీ మరో పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. ప్రతి నిరసన వెనుక నిజమైన సమస్యలే ఉండవని, కొన్ని ఆందోళనలు స్వార్థ ప్రయోజనాల కోసం నడిపించబడుతుంటాయని అభిప్రాయపడ్డారు. కొన్ని నిరసనలు ప్రజల నిజమైన బాధల నుంచి పుడతాయని, అలాంటి ఉద్యమాలను గౌరవించాలని పేర్కొన్నారు. అయితే, మరికొన్ని నిరసనలకు తెరవెనుక స్వార్థ శక్తులు నిధులు సమకూర్చుతూ, వాటిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా నడిపిస్తుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం జరిగే ఉద్యమాలకు, కొన్ని వ్యక్తులు లేదా సంస్థల ఎజెండాల కోసం సృష్టించే నిరసనలకు మధ్య తేడా ఉందని తన పోస్ట్‌లో స్పష్టం చేశారు.

ఈ అంశంపై ఇక చర్చను కొనసాగించదలచుకోలేదని బ్రహ్మాజీ పేర్కొనడంతో ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన మొదట చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇచ్చిన వివరణపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. నిరసనల వెనుక నిజమైన ప్రజా సమస్యలు ఉన్నాయా? లేక కొన్ని స్వార్థ ప్రయోజనాలు పనిచేస్తున్నాయా? అనే అంశంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

 

[Brahmaji Controversy, Brahmaji Latest News, Brahmaji Protest Comments, Brahmaji Clarification, Telugu Actor News, Brahmaji Social Media Post, Brahmaji Trolls]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com