‘భోగి’ మూవీ రివ్యూ: శర్వానంద్ కష్టమంతా వృధా అయ్యిందా?
Nov 27, 2026 11:41AM
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి, శరత్ లోహితాస్వ, లాల్, రోహిత్ పట్నాయక్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఎ.కిశోర్‌కుమార్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: కె.కె.రాధామోహన్
బ్యానర్: శ్రీసత్యసాయి ఆర్ట్స్
రచన, దర్శకత్వం: సంపత్ నంది
విడుదల తేదీ: 27.11.26
సినిమా నిడివి: 154.25 నిమిషాలు
ఇటీవలికాలంలో పీరియాడిక్ డ్రామాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకులు. అందులో అద్భుతాలు చెయ్యాలని చూస్తున్నారు. అయితే ఎక్కడా సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఆ కోవలోనే శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో ‘భోగి’ చిత్రాన్ని రూపొందించారు. 1962 నాటి తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం శర్వానంద్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నారు. అందు కోసం ఎంతో కష్టపడ్డారు. మరి ‘భోగి’ సినిమా ఆయన కష్టానికి తగిన ఫలితాన్నిచ్చిందా? ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నదేమిటి? అనే విషయాల గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
దర్శకుడు సంపత్ నంది తన చిన్నతనంలో రామగిరి గుట్ట ప్రాంతంలో విన్న, చూసిన ఓ మిస్టీరియస్ వ్యక్తి అనుభవాల స్ఫూర్తితో ఈ కథను రూపొందించానని చెప్పారు. బొగ్గులగుట్ట అనే కల్పిత గ్రామంలో జరిగే కథ ఇది. అప్పటి పటేల్, పట్వారి వ్యవస్థ, దొరల అణచివేత, మూఢనమ్మకాలు, చీకటి తోట చుట్టూ జరిగే రహస్యాలు కథలో కీలకంగా ఉంటాయి. బొగ్గులగుట్టలో కమ్మరి గంగ(శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో జీవిస్తుంటాడు. ఇదిలా ఉంటే.. భోగి దిష్టి పూజ సమయంలో అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. సినిమాలో ఇది ఒక కీలకమైన మలుపు. గంగ అన్నయ్యకు మసూచి వ్యాధి రావడంతో పటేలు కోసం అతను చేసే పనిని తమ్ముడు గంగకు అప్పగిస్తారు. కొందరు వ్యక్తులతో కలిసి ఆ పని చేసేందుకు వెళతాడు. కన్నెపిల్లలను ఎత్తుకొచ్చి బలి ఇచ్చే పని అది. అది చూసి వాళ్లను అడ్డుకొని ఆ అమ్మాయిల్ని కాపాడతాడు. ఇది జరిగిన తర్వాత గంగకు పటేల్ నుంచి, వాళ్ల మనుషుల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి? పటేల్ వల్ల అతను నష్టపోయిందేమిటి? అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు ఏంటి? పటేల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దారుణాలను గంగ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఈ సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఫస్ట్‌హాఫ్ అంతా హీరో, అతని చెల్లెళ్లు, అతనికి కాబోయే భార్య, వాళ్ల మధ్య జరిగే సన్నివేశాలతోనే సగం సినిమా అయిపోతుంది. మధ్య మధ్యలో ఆ గ్రామంలో ఉన్న సమస్యను చూపించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉండదు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వంటి సన్నివేశాలు చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో ఆ సీన్స్ చూసేశాం. ఆ ఊళ్లో ట్రిప్‌కి ఐదారుగురు అమ్మాయిలు మిస్ అవుతున్నా ఊరి జనం పట్టించుకున్నట్టు కనిపించరు. దాని గురించి ఎవరూ బాధ పడిన సన్నివేశాలు కూడా ఉండవు. ఒక్కరు మిస్ అయితేనే చర్చ అనేది మొదలవుతుంది. అలాంటిది 100 మందికి పైగా అమ్మాయిలు కనిపించకుండా పోవడం అనేది చాలా సింపుల్ థింగ్ అన్నట్టుగా చూపించారు. తన కుటుంబం విషయంలో హీరోకి నష్టం జరిగినప్పుడు మాత్రమే ఊరి జనం మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ సోసోగా అనిపించినా సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హింసను పతాక స్థాయిలో చూపించి అసలు ఈ సినిమాకి ఎందుకు వచ్చాంరా బాబూ.. అని ఆడియన్స్ చేత అనిపించారు. అయితే నటీనటులంతా ప్రాణం పెట్టి చేశారు. సాంకేతిక నిపుణులు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. అయితే సినిమా కథలో, కథాగమనంలోనే తేడా ఉంది. సినిమాలో ఎలాంటి ఎమోషనల్ సీన్ వచ్చినా ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఆ విషయంలో అంత జాగ్రత్త తీసుకున్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో మితిమీరిన హింస కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ వైపు వచ్చే సాహసం చెయ్యకపోవచ్చు. ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టమంతా వృధా అయిపోతుందా? అనే ఆలోచన ఆడియన్స్‌కి వస్తుంది. అవసరానికి మించిన రక్తపాతం, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల ప్రేక్షకులు కథతో పూర్తిగా కనెక్ట్ కాలేరు. ఐదుగురు చెల్లెళ్లలో కొందరి పాత్రలకు సరైన ప్రాధాన్యం లేదు. అనుపమ, డింపుల్ బాగా చేసినా వారి పాత్రలు మరింత బలంగా ఉండాల్సింది. విలన్ పాత్ర కూడా అంతగా ప్రభావం చూపించదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొత్తంగా మంచి కథాంశం, శర్వానంద్ అంకితభావం, భారీ నిర్మాణం ఉన్నా.. స్క్రీన్‌ప్లేలో బలం లేకపోవడంతో ‘భోగి’ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. పీరియడ్ లుక్, భారీ సెట్లు, హీరోల శారీరక మార్పులపై పెట్టిన శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కలేదనే అభిప్రాయం కలుగుతుంది.
నటీనటులు:
ఈ సినిమాలో నటించిన వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది శర్వానంద్ గురించి. గంగ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన పడిన కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. గంగ చెల్లెళ్లుగా నటించిన ఐదుగురిలో ఎవరూ తెలిసిన ఆర్టిస్టులు కాకపోవడం, వాళ్ల పాత్రలు కూడా ఒక పరిధి దాటి లేకపోవడంతో వాళ్ల పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోలేం. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా బిల్డప్ ఇచ్చిన పటేల్ పాత్రలో శరత్ లోహితాస్వ సెట్ అవ్వలేదు. సులోచనగా అనుపమ పరమేశ్వరన్ తన క్యారెక్టర్‌కి ఉన్న లిమిట్స్‌లో బాగానే చేసింది. మందారం అనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన డింపుల్ హయతి ఫర్వాలేదు అనిపించింది.
సాంకేతిక నిపుణులు:
టెక్నీషియన్స్‌లో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ కిశోర్‌కుమార్ గురించి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వున్న విజువల్స్‌ని ఎంతో అద్భుతంగా చూపించారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల అద్భుతం అనిపించింది, మరికొన్ని చోట్ల అస్సలు బాగాలేదు అనిపించింది. సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. 15 ఎకరాల్లో బొగ్గులగుట్ట గ్రామాన్ని క్రియేట్ చెయ్యడంలో ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది. ఎంతో సహజంగా నిజంగా అక్కడ గ్రామం ఉందా అనిపించేలా ఆ సెట్ వుంది. ఇక డైరెక్టర్ సంపత్ నంది గురించి చెప్పాలంటే.. ఎవరికీ కనెక్ట్ అవ్వని సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆడియన్స్ పై రుద్దే పనిచేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతో అద్భుతంగా పనిచేశారు. కానీ, వారి కష్టానికి తగిన ఫలితం ఇవ్వలేదు అనిపిస్తుంది. అయితే సినిమాలో చాలా చోట్ల డైలాగులు ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల పెర్‌ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్క్రీన్‌ప్లే
మితిమీరిన హింస్
వర్కవుట్ అవ్వని ఎమోషన్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
హింసను అతిగా చూపించి ప్రేక్షకులను హింస పెట్టిన ‘భోగి’, నరకడంపైనే దృష్టి పెట్టి ప్రేక్షకులకు నరకం చూపించిన ‘భోగి’.
రేటింగ్: 2.25/5
- జి.హరా
[BhogiMovieReview, Sharwanand, SampathNandi, AnupamaParameswaran, DimpleHayathi]



.webp)