అలనాటి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మృతి
on Jun 4, 2020
బాలీవుడ్ లెజెండరీ ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్ బసు చటర్జీ గురువారం ఉదయం ముంబైలో మృతి చెందారు. ఆయనకు 90 సంవత్సరాలు. ఆయన పశ్చిమ బెంగాల్ వాసి. వయసు పెరగడం వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రాథమిక సమాచారం. 70, 80వ దశకాలలో ఆయన పలు హిట్ సినిమాలు తీశారు. వెండి తెరపై మాత్రమే కాదు బుల్లితెర మీద తన ప్రతిభ చాటారు.
బాలీవుడ్ క్లాసిక్స్ ఫిలిమ్స్ 'పియా కా ఘర్' (1972), 'రజనీగంధ' (1974), 'ఛోటీసీ బాత్' (1976), 'కట్టా మీటా' (1978), 'షౌకీన్' (1982), 'ఏక్ రుకా హువా ఫైసలా' (1986), 'కమలా కి మౌత్' (1989) కి బసు చటర్జీ దర్శకత్వం వహించారు. వీటితో పాటు కొన్ని బెంగాలీ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రజత్ కపూర్ నటించిన పాపులర్ దూరదర్శన్ టీవీ సిరీస్ 'బ్యూమఖేష్ బక్షి' కూడా ఆయన దర్శకత్వం వహించినదే. బసు చటర్జీ మృతిపట్ల పలువురు టీవీ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.