బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: ఫిర్యాదుదారుడి వీడియోతో బయటపడ్డ అసలు నిజం!
Nov 24, 2026 4:18PM

బండ్ల గణేష్‌కి సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ఈ కేసు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేసిన జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా స్పందించారు. బండ్ల గణేష్, తమ మధ్య ఉన్న వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని, ఇక ఎలాంటి ఆర్థికపరమైన, వ్యక్తిగత సమస్యలు లేవని ప్రకటించారు. అంతేకాదు.. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను కూడా బయటపెట్టారు. మరి ఇంతకీ బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వరరావు మధ్య ఏం జరిగింది?
ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బండ్ల గణేష్‌తో తమకు గత 15 ఏళ్లుగా మంచి స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.
గతంలో తన కుమారుడు, బండ్ల గణేష్ ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. అయితే తన కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని,ఆ సమయంలో ఏర్పడిన వ్యక్తిగత ఇగో కారణంగానో, మధ్యవర్తుల జోక్యం వల్లనో తమ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని వెల్లడించారు.
ఆ విభేదాలే చివరకు కోర్టు కేసుల వరకు వెళ్లాయని ఆయన వివరించారు. అంటే ఇంతకాలం కొనసాగిన వివాదం వెనుక కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట.

నవంబర్ 18న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల పేరుతో అనవసర హడావుడి చేశారని జెట్టి వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. తాము వద్దని చెబుతున్నా కొందరు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: భోగి ఫస్ట్ రివ్యూ: ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్టులా? బిగ్గెస్ట్ హిట్ అవుతుందా!
ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని, వ్యక్తిగత విభేదాలు కూడా పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవో.. ఇకపై కూడా బండ్ల గణేష్‌తో అలాంటి అనుబంధమే కొనసాగుతుందని తెలిపారు.
ఇక ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయానికి వస్తే.. 2018లో బండ్ల గణేష్ జె. జానకిరామయ్య నుంచి రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే బ్యాంకులో ఆ చెక్ నగదుగా మారకపోవడంతో జెట్టి వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అప్పీల్‌కు వెళ్లగా, నవంబర్ 18న అప్పీల్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి.
.webp)
ఇక ఇప్పుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా ముందుకొచ్చి తమ మధ్య అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రకటించడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి పెరిగింది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య రాజీ కుదరడం వేరు.. కోర్టులో కొనసాగుతున్న కేసు చట్టపరంగా ముగియడం వేరు. ఈ విషయంలో తదుపరి కోర్టు ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తానికి గత 15 ఏళ్ల స్నేహంలో వచ్చిన చిన్నపాటి మనస్పర్థలు పెద్ద వివాదానికి దారితీయగా.. ఇప్పుడు మళ్లీ ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు జెట్టి వెంకటేశ్వరరావు మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ పరిణామం తర్వాత బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు
తెలుగు సినిమాలకి అనిరుధ్ గండం!
100 డేస్ ఆడిన చివరి సినిమా అదే!
[Bandla Ganesh, Cheque Bounce, Jetti Venkateswara Rao, Tollywood]



