Home

»

Latest News

‘వెయ్యి మెట్లు ఎక్కితేనే ఆ లోకంలోకి వెళ్లగలం’.. ‘రాకా’పై అనల్ అరసు క్రేజీ అప్‌డేట్‌.!

Oct 20, 2026 6:23PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు వెల్లడించారు. ఈ సినిమా విజువల్ స్కేల్‌ను వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ఒక అంతస్తు ఎక్కడానికి 10 నుంచి 25 మెట్లు సరిపోతే, ‘రాకా’లో అట్లీ సృష్టించిన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఏకంగా వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుందని ఆయన పోల్చి చెప్పారు. 

‘రాకా’ సాధారణ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా, పూర్తిగా భిన్నమైన కల్పిత ప్రపంచం నేపథ్యంలో సాగనుందని అనల్ అరసు మాటలను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగిస్తూ, ప్రత్యేక శక్తులు కలిగిన పాత్రలకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. ఆయా పాత్రల కదలికలు, నడక, మానవాతీత విన్యాసాలను తెరపై సహజంగా చూపించడం తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. 

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్యకృష్ణ, జిమ్ సర్భ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు కథనం పేర్కొంది. పునర్జన్మలు, సైన్స్ ఫిక్షన్ అంశాల నేపథ్యంలో కథ సాగనుందని, అల్లు అర్జున్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారని సమాచారం. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భారీ సాంకేతిక హంగులు, విభిన్నమైన పాత్రలు, కొత్త తరహా యాక్షన్‌తో ‘రాకా’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందోననే ఆసక్తి నెలకొంది. 

 

 

[Allu Arjun Raaka, Raaka Movie Update, Atlee Raaka Movie, Anal Arasu Interview, Allu Arjun Action Film, Deepika Padukone Raaka, Raaka Sci Fi Movie, Sun Pictures Raaka]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com