
అల్లరి నరేష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ మధ్యకాలంలో కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ‘కనకదుర్గ’ సినిమాతో మరోసారి ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అల్లరి నరేశ్కు సంబంధించిన స్ట్రైకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
బిర్లా స్టూడియోస్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ సరసన కాజల్ చౌదరి నటిస్తున్నారు. సుబ్బరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
‘కనకదుర్గ’ కథలో దైవభక్తి, యాక్షన్, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉండనుంది. ఒక వ్యక్తి జీవితంలో ఎదురైన దైవిక అనుభవం అతడిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఆ తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగింది? అనే అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో అల్లరి నరేష్ ఈసారి ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆ కార్యక్రమానికి కొణిదెల సురేఖ, అల్లు అరవింద్ హాజరయ్యారు. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర బృందం.. త్వరలోనే తొలి పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇది కూడా చదవండి: అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా.?
[Allari Naresh Kanaka Durga Movie, Kanaka Durga First Look, Kanaka Durga First Single, Kanaka Durga, Allari Naresh, Kajal Choudhary, Pradeep Maddali, Telugu Film News]






