Home

»

Latest News

ఏఐ టెక్నాలజీతో గ్రాఫిక్స్ కొత్త పుంతలు: మేకర్స్‌లో మొదలైన అసలు భయం!

Sep 11, 2026 3:02PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఇప్పుడు ప్ర‌పంచానికి పెద్ద స‌వాలుగా మారింది. అన్ని రంగాలతో పాటు చిత్రసీమను కూడా ఎఐ చుట్టుముడుతోంది. ఇటీవల కాలంలో సాధారణ నెటిజన్లు సైతం సాంకేతికతను ఉపయోగిస్తూ ఊహకందని రీతిలో విజువల్స్ క్రియేట్ చేస్తున్నారు. సరదాగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌కు సరికొత్త సవాల్‌గా మారుతోంది.

సోషల్ మీడియాలో ఈ మధ్య ఏఐ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుతో ఎస్‌ఎస్ఎంబి29 తరహా పౌరాణిక లుక్స్ నుంచి, పాతతరం నటులను సరికొత్త కోణంలో చూపించడం వరకు క్రియేటర్లు తమ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. బ్రహ్మానందం పాత పాత్రల కలయికతో కొత్త ప్రేమకథలు, 80ల నాటి హీరోల కాలేజ్ లుక్స్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.

సాధారణ పరిజ్ఞానంతో నెటిజన్లే ఈ స్థాయి విజువల్స్ రూపొందిస్తుంటే, వందల కోట్లు ఖర్చు చేసే నిర్మాతల నుంచి ప్రేక్షకులు మరింత క్వాలిటీ ఆశిస్తున్నారు. టీజర్లు, ట్రైలర్లలో ఏమాత్రం గ్రాఫిక్స్ తక్కువగా ఉన్నా ప్రేక్షకులు వెంటనే నెగెటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి 'విశ్వంభర' సినిమా విఎఫ్ఎక్స్ వ్యవహారంలో జరిగిన చర్చలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం.

మరోవైపు తమ రూపాలు, గొంతులను అనుమతి లేకుండా ఏఐ ద్వారా దుర్వినియోగం చేయకుండా చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులు ఇప్పటికే న్యాయపరమైన రక్షణ పొందారు. అయితే సాంకేతికత విస్తృతి దృష్ట్యా ప్రతి ఒక్కరినీ చట్టపరంగా నిరోధించడం కష్టతరంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలోని ఏదైనా సన్నివేశం సరిగ్గా రాకపోతే, నెటిజన్లు ఏఐ సాయంతో అంతకంటే మెరుగైన అవుట్‌పుట్ డిజైన్ చేసి వైరల్ చేసే పరిస్థితి దాపురిస్తోంది. ఇది దర్శకులు మరియు విఎఫ్ఎక్స్ టీమ్‌లకు మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చలపై టాలీవుడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికతను ఆహ్వానించాల్సిందేనని కొందరు అంటుంటే, క్రియేటివిటీకి భంగం వాటిల్లకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏఐ సృష్టిస్తున్న ఈ సవాళ్లను అధిగమించాలంటే చిత్ర పరిశ్రమ కేవలం సాధారణ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా, ఎవరు అందుకోలేని మేటి నాణ్యతతో విజువల్స్ తెరకెక్కించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ సినిమా రంగాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com