ఎన్టీఆర్‌ని రాజకీయాలు వదల్లేదు!
on Dec 19, 2018
ఎన్టీఆర్ రాజకీయాలను వదిలేసి చాలా కాలమైంది. సూటిగా చెప్పుకోవాలంటే... 'అన్నగారు' అని ఆప్యాయంగా తనను పిలిచే తెలుగు ప్రజలను, ఈ లోకాన్ని వదిలేసి చాలా కాలమైంది. కానీ, ఆయన్ను మాత్రం రాజకీయాలు వదల్లేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అన్నగారి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ని రాజకీయాలు వదల్లేదని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి. ఎన్టీఆర్‌కీ, రాజకీయాలకూ మధ్య బంధం ఎంత బలంగా ముడి పడిందంటే... ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'యన్.టి.ఆర్' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రాజకీయాలు అడ్డం పడేంత! తొలుత భాగ్య నగరంలో 'యన్.టి.ఆర్' ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించాలని సన్నాహాలు చేశారు. చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమం రద్దు చేయడానికి, రాజకీయాలకు సంబంధం వుందనేది ఫిలింనగర్ టాక్.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి తెలంగాణ రాష్ట్ర సమితితో పోటీ పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ తనయుడు, కథానాయకుడు బాలకృష్ణ కేసీఆర్ మీద, ఆయన టి.ఆర్.ఎస్ పార్టీ మీద విమర్శలు చేశారు. తీరా చూస్తే.. ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఘానా విజయం సాధించింది. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించాలని 'యన్.టి.ఆర్'లో తండ్రి ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలకృష్ణ అనుకున్నారట. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ప్రముఖుల్ని పిలిచి ఫంక్షన్ చేయడం బావుండదని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమం రద్దు కావడానికి అసలు కారణం అదేనట! మరోవైపు ఈ నెల 21న నిమ్మకూరులో జరగనున్న ఆడియో విడుదలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. ఆడియో విడుదల కార్యక్రమంలో ట్రైలర్ కూడా విడుదల చేయాలని నిర్ణయించారు.