ENGLISH | TELUGU  

'లైగర్' ట్రైలర్.. మాటల్లేవు మాట్లాడుకోవడాల్లేవు

on Jul 21, 2022

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా అనగానే సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు 'సాలా క్రాస్ బ్రీడ్' అంటూ 'లైగర్' అనే టైటిల్ పెట్టడంతో పాటు.. టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

"ఒక లయన్ కి,  టైగర్ కి పుట్టాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ" అంటూ రమ్య కృష్ణ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తనదైన యాటిట్యూడ్, యాక్షన్ తో అదరగొట్టాడు విజయ్. తల్లీకొడుకుల బాండింగ్ ట్రైలర్ లో ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ పవర్ ఫుల్ వాయిస్, విజయ్ ని ఆమె కాలితో తన్నడం చూస్తుంటే.. తల్లి వల్లే కొడుకు అంత పవర్ ఫుల్ గా తయారయ్యాడని అర్థమవుతోంది.

మాములుగా పూరి జగన్నాధ్ సినిమాలంటే హీరోలు చెప్పే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. కానీ 'లైగర్' ట్రైలర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ ట్రైలర్ లో విజయ్ మహా అయితే రెండు డైలాగులు చెప్పాడు. ఒకటి 'ఐ లవ్ యూ', రెండోది 'ఐయామ్ ఏ ఫైటర్'. అవి కూడా 'ఐ.. ఐ..' అంటూ చెప్పడం చూస్తుంటే హీరోకి నత్తి అనిపిస్తోంది. ట్రైలర్ ని ఎక్కువగా యాక్షన్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ లో లైగర్ టైటిల్ ట్రాక్ తో నడిపించారు. పూరి డైరెక్ట్ చేసిన 'ఇద్దరమ్మాయిలతో' మూవీలో 'మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవు' అనే డైలాగ్ ఉంటుంది. ఆ స్టైల్ లో 'లైగర్'లో 'డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ' అని పూరి హింట్ ఇచ్చాడేమో అనిపిస్తోంది.

అనన్య తన గ్లామర్ తో కట్టి పడేస్తోంది. ఇక ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ట్రైలర్ చివరిలో "నువ్వు ఫైటర్ అయితే.. నేనెవరిని?" అని చెప్పడం ఆకట్టుకుంది. మొత్తానికి ట్రైలర్.. యాక్షన్, లవ్, ఎమోషన్ కలగలిసి పూరి మార్క్ మూవీలా ఉంది.

తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఆగష్టు 25న విడుదల కానుంది. ఇదే విజయ్ కి మొదటి హిందీ సినిమా. ఇప్పటిదాకా ఒక్క హిందీ సినిమా గాని, పాన్ ఇండియా ఫిల్మ్ గాని చేయకుండానే.. బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్. మరి ఇప్పుడు 'లైగర్'తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.