బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘సూర్య’ (Suryaa) మేకర్స్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇంతకుముందు విడుదలైన మోషన్ పోస్టర్‌లో సరికొత్త రఫ్ అండ్ రఫ్ లుక్‌లో కనిపించిన సన్నీ డియోల్.. టీజర్‌లోనూ తనదైన పవర్‌ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. “అదే అతని అంతమని అందరూ భావించారు.. కానీ సూర్యకు అది కేవలం ఆరంభం మాత్రమే” అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ టీజర్‌లో వైద్య వ్యవస్థలోని అవినీతి, రోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు సాగిస్తున్న దోపిడీ వంటి అంశాలను చూపించారు. వైద్యులను దేవుళ్లుగా భావించే ప్రజల నమ్మకాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే ప్రశ్నను సన్నీ డియోల్ పాత్ర లేవనెత్తుతుంది. గతంలో ఎదురైన వ్యక్తిగత విషాదం ఆయన పాత్రను సత్యాన్వేషణ వైపు నడిపిస్తుంది. ఈ క్రమంలో వ్యవస్థలో దాగి ఉన్న నిజాలను బయటపెట్టేందుకు ఆయన చేసే పోరాటం కథలో కీలకంగా ఉండబోతోంది.
‘సూర్య’ చిత్రానికి మలయాళ దర్శకుడు ఎం.పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి కిషన్, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు జిషు సేన్‌గుప్తా, టిను ఆనంద్, మనీష్ వాధ్వా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ ముకుట్ సమర్పణలో ఎంఎం మూవీజ్ బ్యానర్‌పై దీపక్ ముకుట్, హెమ్మంత్ ముకుట్, లోకేష్ ముకుట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018లో విడుదలైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘జోసెఫ్’కు హిందీ రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా భావోద్వేగాలు, దర్యాప్తు, కుట్రలు, వైద్య వ్యవస్థలోని అక్రమాల చుట్టూ కథను నడిపిస్తున్నట్లు టీజర్ సూచిస్తోంది. సన్నీ డియోల్ పాత్రలోని ఆవేదన, నిజాన్ని వెలికితీయాలనే పట్టుదల సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
[Sunny Deol Suryaa, Suryaa Teaser, Sunny Deol Birthday Special, Suryaa Movie 2026, M Padmakumar, Ravi Kishan, Pragya Jaiswal, Suryaa Release Date]




