
సోషల్ మీడియాలో ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసిన సెలబ్రిటీల వీడియోలు ప్రచారం చేయడం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న మార్ఫింగ్, అశ్లీల కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కంగనా రనౌత్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కంగనా గుర్తించిన అభ్యంతరకరమైన వీడియోలు, రీల్స్, పోస్టులు, అకౌంట్లు, ఛానళ్లను తొలగించాలని లేదా వాటికి యాక్సెస్‌ను నిలిపివేయాలని సూచించింది. కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన అందిన 72 గంటల్లో ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

అంతేకాదు.. కంగనా పేరు, ఫొటో, గొంతు, ప్రసంగాలు, వ్యక్తిత్వాన్ని పోలిన అంశాలను ఆమె అనుమతి లేకుండా ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేయడంపై కూడా న్యాయస్థానం ఆంక్షలు విధించింది.
కంగనా తరఫు న్యాయవాదులు ఆమెపై ప్రచారంలో ఉన్న నకిలీ వార్తలు, అశ్లీల కంటెంట్, ఏఐ సాయంతో రూపొందించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోల అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించే కంటెంట్ కూడా సమస్యగా మారిందని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కంగనా వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించే కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాంటి కంటెంట్ ఉన్నట్లు భవిష్యత్తులో గుర్తిస్తే, కొత్తగా మరో కేసు వేయకుండానే సంబంధిత లింకులు, అకౌంట్లు, ఛానళ్ల వివరాలను మెటా, ఇతర ఇంటర్నెట్ మధ్యవర్తులకు తెలియజేసి తొలగింపు చర్యలు కోరేందుకు కూడా కంగనాకు వెసులుబాటు కల్పించింది.
అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్నట్లు గుర్తించిన వెబ్‌సైట్లకు యాక్సెస్‌ను నిలిపివేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు టెలికమ్యూనికేషన్స్ శాఖను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో మెటా సహా సంబంధిత సంస్థల నుంచి వివరణ కోరుతూ న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ‘రణబాలి’ కోసం రంగంలోకి అన్నామలై.. సినిమా విడుదలకు ముందు సంచలనం తప్పదా.?
[Kangana Personality Rights, Kangana Ranaut AI Content, Kangana Ranaut Fake Video, Kangana Ranaut AI Video, Delhi High Court, Kangana Ranaut, Telugu News]




