English | Telugu

`ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` : ఫ‌లించిన సామాన్యుడి క‌ల‌

`ఇక్క‌డ క‌థ‌లు మీవి.. క‌ల‌లు మీవి.. ఆట నాది కోటి మీది` అంటూ బుల్లితెర‌పై స‌రికొత్త రియాలిటీ షోతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. బిగ్‌బాస్ రియాలిటీ షోతో బుల్లితెర హోస్ట్‌గా ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆ త‌రువాత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్ జెమినీ టీవీ కోసం `ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు` గేమ్ షోకు షోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సామాన్యుల‌ని కోటీశ్వ‌రులుగా మార్చేస్తాం అంటూ ప్ర‌చారం చేస్తున్న ఎన్టీఆర్ నిజంగానే ఓ సామాన్యుడిని కోటీశ్వ‌రుడిని చేసేశాడు.

తాజా సీజ‌న్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ షోలో పాల్గొన్న ఏ కంటెస్టెంట్ కోటిని గెల‌వ‌లేక‌పోయాడు. కానీ తాజాగా ఆ అద్భుతం ఆవిష్కృత‌మైంది. ఓ సామాన్యుడు ఓ విచిత్ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న త‌న త‌న‌యుడి కోసం పోటీలో పాల్గొని ఏకంగా కోటి గెలుచుకుని సంచ‌ల‌నం సృష్టించాడు. చ‌క చ‌కా గేమ్ ఆడుతూ యంగ్ టైగ‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ ట‌కా ట‌కా స‌మాధానాలు చెప్పిన కంటెస్టెంట్ కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు కూడా అంతే స్పీడుతో స‌మాధానం చెప్పేసి కోటి గెలుచుకోవ‌డంతో హోస్ట్ ఎన్టీఆర్ షాక్‌కి గుర‌య్యార‌ట‌.

కోటి రూపాయ‌ల ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పేసి కోటి గెలుచుకున్న కంటెస్టెంట్‌కి సంబంధించిన ప్రోమోని తాజాగా జెమిని టెలివిజ‌న్ వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. అయితే ఈ ప్రోమోలో కోటి గెలుచుకున్న‌ది ఎవ‌రో మాత్రం చూపించ‌కుండా సీక్రెట్‌గా వుంచారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.