English | Telugu

నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన సింగ‌ర్ సునీత‌

సెల‌బ్రిటీల‌ని చాలా మంది నెటిజ‌న్స్ ఈ మ‌ధ్య అన‌వ‌స‌రంగా టార్గెట్ చేస్తూ వారిని ఇరిటేట్ చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మందిని మ‌న‌స్థాపానికి గుర‌య్యేలా చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇలాంటి అనుభ‌వం ఎదుర్కోన్న చాలా మంది సెల‌బ్రిటీలు అక్క‌డిక‌క్క‌డే వారికి దిమ్మ‌దిరిగే రిప్లై ఇస్తూ నెట్టింట సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. తాజాగా సింగ‌ర్ సునీతకు కూడా ఇదే అనుభ‌వం ఎదురైంది. గ‌త కొంత కాలంగా సింగ‌ర్ సునీత సోష‌ల్ మీడియా వేదిక‌గా యాక్టీవ్ గా వుంటున్నారు.

త‌న‌ని కావాలని కొంత మంది నెటిజ‌న్ లు టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆమె హుందాగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారే కానీ ఎవ‌రినీ విమ‌ర్శించ‌డం లేదు. అయితే అలాంటి ఆమెని కూడా ఓ నెటిజ‌న్ ఆగ్ర‌హానికి గుర‌య్యేలా చేశాడు. నిన్న సునీత ఓ పోస్ట్ చేసింది. తన భ‌ర్త రామ్‌తో క‌లిసి స‌మ‌తా విగ్ర‌హం ముందు నిల‌బ‌డి ఫొటోని అభిమానుల‌తో పంచుకుంది. ఇదే సంద‌ర్భంగా 'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' అంటూ ఓ ఫొటోను సునీత షేర్ చేశారు. "కాకి ముక్కుకు దొండ‌పండు. సునీత‌కు ముస‌లి రామ్ మొగుడు.. అందం ఆమె సొంతం.. ధ‌నం ఆయ‌న సొంతం.. గానం ఈవిడది ద‌ర్జా అత‌నిది".. అంటూ సునీత పోస్ట్ పై ఓ నెటిజ‌న్ అడ్డంగా వాగేశాడు.

దీంతో సునీత‌కు ఒళ్లు మండింది. "నీలాగే నెగిటివిటీని చూపించేవారు ఈ భూమికే భారం" అంటూ మండిప‌డింది. అంతే కాకుండా మ‌రింత ఘాటుగా స‌ద‌రు నెటిజ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అండ‌గా నిలిచిన అభిమానుల‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. "నాపై మీకున్న ప్రేమ‌కి, గౌర‌వానికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డివుంటాను. నా కోసం నిల‌బ‌డే శ్రేయోభిలాషులు ఇంత మంది వున్నార‌ని తెలిసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే వున్నాను.. అయినా ఎప్పుడూ ఎవ‌రినీ ద్వేషించే గుణం రాలేదు. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేద్దాం" అని సునీత అన్నారు.