English | Telugu

'బిగ్ బాస్ 5': నటరాజ్ మాస్టర్‌ను పంపేశారు!

'బిగ్ బాస్' హౌస్‌లో నటరాజ్ మాస్టర్ దూకుడుకు శుభం కార్డు పడిందా? తన కోపమే తన శత్రువు అన్న నానుడిని నిజం చేస్తూ... కోపధారి మనిషిగా ముద్ర పడిన నటరాజ్ మాస్టర్‌ను బయటకు పంపేశారా? అంటే 'అవును' అనే సమాధానం వినబడుతోంది. 'బిగ్ బాస్' ఐదో సీజన్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్ ఇంటి నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

'బిగ్ బాస్ 5' నాలుగో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో నలుగురు... యాంకర్ రవి, ఆర్టిస్ట్ ప్రియా, యూట్యూబర్ సిరి హనుమంతు, ఇంకా సన్నీ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు అక్కినేని నాగార్జున శనివారం వెల్లడించారు. మిగతా నలుగురిని అలా డేంజర్ జోన్‌లో ఉంచారు. అందులో నటరాజ్ మాస్టర్ మీద వేటు పడింది.

నటరాజ్ మాస్టర్ కాకుండా యానీ మాస్టర్, లోబో కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. మహిళా కోటాలో యానీ, ఎంటర్టైన్మెంట్ ఇస్తూ డ్రామా పండిస్తున్నందుకు లోబోను సేఫ్ చేసినట్టు అర్థమవుతోంది. నటరాజ్ మాస్టర్ గేమ్ పక్కన పెడితే... కొన్నిసార్లు ఆయన ఆగ్రహం డిస్కషన్ పాయింట్ అవుతోంది. అందుకే ఆయన్ను పంపించారేమో!