English | Telugu
డాక్టర్ బాబు కోసం నేరం నెత్తిన వేసుకున్న సౌందర్య! అయినా...
Updated : Aug 12, 2021
'కార్తీక దీపం'లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నకొడుడు మీద ప్రేమతో హత్యా నేరాన్ని నెత్తిన వేసుకోవడానికి తల్లి సిద్ధపడింది. అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఇవాళ్టి (ఆగస్టు 12, 1115) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
మోనితను హత్య చేసి, శవాన్ని కనిపించకుండా మాయం చేశాడనే ఆరోపణ మీద డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్‌ను ఏసీపీ రోషిణి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాను డాక్టర్ బాబుకు హిమను హత్య చేయించినట్టు మోనిత మాట్లాడిన వీడియో చూపించకుండా ఉన్నట్టు అయితే ఈ ఘోరం జరిగేది కాదని వంటలక్క అలియాస్ దీప రోదిస్తుంటుంది. పిల్లలతో పాటు కార్తీక్ కుటుంబమంతా కన్నీరు మున్నీరు అవుతుంది.
కార్తీక్ అరెస్ట్ విషయం తెలిసిన తల్లి సౌందర్య అమెరికా నుండి తిరిగొస్తుంది. పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. అక్కడ ఏసీపీ రోషిణితో తానే హత్య చేశానని చెబుతుంది. టేబుల్ మీద గన్ పెడుతుంది. 'సరెండర్ అవ్వడానికి వచ్చాను. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఇదే. నా కొడుక్కి నేనంటే ప్రేమ. అందుకే, నేరాన్ని వాడి మీద వేసుకున్నాడు. నన్ను అరెస్ట్ చేసి, వాడిని రిలీజ్ చేయండి' అని సౌందర్య అంటుంది. ఆమె మాటలకు రోషిణి నవ్వుతుంది.
హత్య చేసింది తానేనని సౌందర్య చెప్పినా... రోషిణి నమ్మదు. పైగా, 'మీ కొడుక్కి మీ మీద ఉన్న ప్రేమ కంటే... మీకే మీ కొడుకు మీద ఎక్కువ ప్రేమ అనుకుంట' అంటుంది. తర్వాత తన లాజిక్ ఏంటో చెబుతుంది. 'ఒకరి మీద ఒకరికి మీకు ఎంత ప్రేమ ఉందో, నాకు నా డ్యూటీ మీద అంత ప్రేమ. రెండు గంటల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన మీరు సరాసరి దీప ఇంటికి వెళ్లారు. అక్కడ కారులో రివాల్వర్ తీసుకున్నారు. దీపను పలకరించకుండా నేరుగా ఇక్కడికి వచ్చారు. హత్య జరిగింది నిన్న. ఈ రోజు సిటీకి వచ్చిన మీరు ఎలా చేశారో మీ తల్లి ప్రేమకు తెలియాలి' అని రోషిణి అంటుంది.
దాంతో సౌందర్యను అరెస్ట్ చేసి, డాక్టర్ బాబును విడుదల చేసే ఉద్దేశం రోషిణికి లేదని అర్థమయింది. తర్వాత ఏం జరుగుతుందో, రేపటి ఎపిసోడ్ లో చూడాలి.