English | Telugu
తప్పించుకున్న మోనిత.. కారులో వెంటాడుతున్న దీప!!
Updated : Sep 8, 2021
'కార్తీక దీపం' సీరియల్‌లో కథ మరో కీలక ఘట్టానికి చేరుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 8) ఎపిసోడ్ వీక్షకుల్లో ఉత్కంఠ పెంచింది. తర్వాత ఏం జరుగుతుందోనని టెన్షన్ పెట్టి ఎపిసోడ్ ముగించారు. ఆల్రెడీ ప్రోమోలో దీపకు మోనిత దొరికినట్టు చూపించారు. అది ఈ రోజు ఎపిసోడ్ లో ఉంది. ఆ తర్వాత దీప నుండి మోనిత తప్పించుకోవడం, మోనితను వెంటాడుతూ కారులో దీప బయలుదేరడం ఇవాళ్టి ఎపిసోడ్ హైలైట్స్. అసలు, ఈ రోజు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...
డాక్టర్ రీనా వేషంలో మోనిత ఆస్పత్రికి వచ్చేసరికి కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. భర్త శిక్ష తప్పించుకోవడానికి వేరే దారి లేదా? అని దీప ఏడుస్తుంది. 'మోనిత బతికి ఉందని నిరూపిస్తే... మోనిత దొరికితే శిక్ష నుంచి తప్పించుకోగలను. కాని, ఆ దారి మూసుకుపోయింది' అని కార్తీక్ అంటాడు. అప్పుడు సోదమ్మ వేషంలో మోనిత గుడికి వచ్చిందని, దుర్గను చూసి పారిపోయిందని దీప చెబుతుంది. మూగమ్మాయిగా టీ తీసుకొచ్చినది కూడా మోనిత అని కార్తీక్ అంటాడు. దాంతో తన గురించి ఎక్కడ చెబుతాడోనని మోనిత భయపడుతుంది.
అక్కడ నుండి దూరంగా బయటకు వెళుతుంది. 'నేను పెళ్లి చేసుకోవాలని వస్తే... నన్ను అజ్ఞాతంలోకి పంపాలని చూస్తున్నాడా?' అని మనసులో అనుకుని ఫోన్ చేస్తుంది. డాక్టర్ రీనా కాల్ చేశారని కార్తీక్ దగ్గరకు ఓ పోలీస్ ఫోన్ తీసుకొస్తాడు. 'ఏంటి? గొంతు పూడుకుపోయింది?? మీ ఆవిడతో నా గురించి చెప్పేటప్పుడు బాగానే ఉంది కదా?' అని మోనిత వాయిస్ వినిపించడంతో ఎక్కడ ఉందోనని కార్తీక్ బయటకు వచ్చి చూస్తాడు. కనిపించదు. పోలీసులు ఏమైందన్నట్టు సైగ చేయడంతో మళ్ళీ లోపలకి వెళతాడు. 'మన పెళ్లికి అరగంట మాత్రమే ఉంది. అంతా చెప్పేస్తే... నీ భార్య ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేసి మన పెళ్లి ఆపేస్తుంది కదా?' అంటుంది మోనిత.
'మన పెళ్లి జరగకపోతే నేను అజ్ఞాతం నుంచి బయటికి రాను కదా! నువ్వు జైలు పాలు అయిపోతావ్ కదా? నీ వాళ్లందరినీ నేను బతకనివ్వను కదా. నువ్వు మరీ ఇంత అమాయకంగా తయ్యారయ్యావేంటి కార్తీక్' అని చెబుతూ పోతుంది మోనిత. 'నిన్ను ఆడదానిగా కాదు... మనిషిగా చూడటం లేదు. నీతో కాపురం ఎలా చేస్తానని అనుకుంటున్నావు?' అని కార్తీక్ కోప్పడతాడు. సరిగ్గా అప్పుడే మోనితను దీప చూస్తుంది. కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన సన్నివేశాలు గుర్తు చేసుకుని కార్తీక్ కంగారుకు కారణం ఇదన్నమాట అనుకుని మోనిత దగ్గరకు వస్తుంది.
మోనితకు దగ్గరగా వచ్చిన దీప, ఆమె వెనకాల నిలబడుతుంది. 'నా గురించి నా కన్నా ఎక్కువగా నీకే తెలుసు కార్తీక్! త్వరగా నీ పెళ్లాన్ని ఇక్కడి నుంచి పంపించేయ్. నా మెడలో తాళి కట్టేసెయ్! హిమను చంపిన నాకు... దీపను, నీ కుటుంబాన్ని చంపడం పెద్ద కష్టం కాదు' అని వార్నింగ్ ఇస్తుంది. వెనుక ఉన్న దీప కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్లేట్స్ నేలకేసి గట్టిగా కొడుతుంది. మోనిత వెనక్కి తిరిగి చూస్తే.... దీప. అమ్మవారిలా కళ్ళు పెద్దవి చేసుకుని ఉగ్రరూపం దాలుస్తుంది.
"ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుంటావే? డాక్టర్ బాబును కాపాడటం కోసమే ఆ దేవుడు నిన్ను నాకు చూపించాడు. రావే" అంటూ మోనిత జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళడానికి దీప ప్రయత్నిస్తుంది. దీపను పక్కకు తోసేసి... అక్కడ నుండి తప్పించుకుని క్యాబ్ ఎక్కి మోనిత పారిపోతుంది. వారణాసిని కార్ తీయమని క్యాబ్ ను ఫాలో అవుతుంది దీప. మోనిత ఓటీపీ చెప్పకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకున్నది ఆమె కాదని డ్రైవర్ గమనిస్తాడు. దింపేయబోతే... మోనిత రెండువేల రూపాయల నోట్ల కట్ట విసరడంతో ముందుకు పోనిస్తాడు.
ముందు క్యాబ్ లో మోనిత... దాన్ని ఫాలో అవుతూ వెనుక కారులో దీప... ఛేజింగ్ సీన్ బాగా తీశారు. ప్లేట్స్ కడగటానికి వెళ్లిన దీప ఎంతసేపటికీ రాకపోవడంతో కార్తీక్ ఆలోచించడం మొదలు పెడతాడు. మోనితను పట్టుకోవడానికి వెళ్ళిందేమోనని సందేహిస్తాడు. 'డాక్టర్ రీనా వచ్చారా?' అని అడిగితే... 'ప్రస్తుతం రూమ్ లో లేరు' అని ఓ నర్స్ చెబుతుంది. దాంతో కార్తీక్ సందేహం బలపడింది. బయటకు వెళ్ళబోతే పోలీసులు ఆపుతారు. ఈలోపు రత్నసీత వస్తే ఆమెతో 'మా దీప కనిపించడం లేదు. నువ్వు డాక్టర్ రీనాను చూశావా? అని కార్తీక్ అడుగుతాడు. దాంతో రత్నసీత షాక్ అవుతుంది. తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.