English | Telugu

మూడో పెళ్లికైనా, స‌హ‌జీవ‌నానికైనా రెడీ అంటున్న క‌రాటే క‌ల్యాణి!

ఇప్ప‌టికి రెండు పెళ్లిళ్లు చేసుకొని, విడిపోయిన న‌టి క‌రాటే క‌ల్యాణి బిగ్ బాస్ సీజ‌న్ 4లో త‌న బోల్డ్ బిహేవియ‌ర్‌తో త‌న‌కంటూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఏ విష‌యంపైన అయినా నిక్క‌చ్చిగా, నిర్భ‌యంగా మాట్లాడే మ‌నిషిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లుసార్లు ఆమె వ్యాఖ్య‌లు, చ‌ర్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి కూడా. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన క‌ల్యాణి, త‌న‌కు ఇంత‌దాకా ప్రేమ‌, పెళ్లి క‌లిసి రాలేద‌నీ, ఇంత‌దాకా త‌న‌కు నిజ‌మైన ప్రేమ ల‌భించ‌లేద‌నీ చెప్పి, భావోద్వేగానికి గుర‌య్యారు.

"ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా. కానీ ఆ ఆశ ఇప్పటికీ నెర‌వేర‌లేదు" అని క‌ల్యాణి చెప్పుకొచ్చారు.

"నేను ఫైర్ లాంటి దాన్ని. అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా" అని చెప్పారు కల్యాణి.

"ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్నాను. అయినా కూడా బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదేదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మందికి సాయం చేస్తూ ఇలా ఒంటరిగా జీవిస్తున్నా" అంటూ ఆమె తెలిపారు.