English | Telugu
దారుణంగా పడిపోయిన 'బిగ్ బాస్' రేటింగ్!
Updated : Sep 15, 2022
బిగ్ బాస్ షో తెలుగు ఆరో సీజన్ ఇటీవల ప్రారంభమైంది. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. బిగ్ బాస్-6 ఫస్ట్ ఎపిసోడ్ కి దారుణమైన రేటింగ్ వచ్చింది.
2017లో బిగ్ బాస్ తెలుగు ప్రకటన వచ్చినప్పుడు.. ఈ షోని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ఈ షోని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. లాంచ్ ఎపిసోడ్ కి ఏకంగా 16.18 రేటింగ్ వచ్చింది. రెండో సీజన్ ని నాని హోస్ట్ చేయగా ఫస్ట్ ఎపిసోడ్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో 15.05 రేటింగ్ వచ్చింది. ఇక మూడో సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వచ్చాక రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 17.9, నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి 18.5 రేటింగ్ తో సంచలనం సృష్టించాడు నాగ్. ఐదో సీజన్ కి కాస్త తగ్గినప్పటికీ 15.71 అనేది మంచి రేటింగ్ అనే చెప్పాలి. అయితే రీసెంట్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్-6 లాంచ్ ఎపిసోడ్ రేటింగ్ మాత్రం దారుణంగా ఉంది.
బిగ్ బాస్-6 ఫస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న ప్రసారం కాగా కేవలం 8.86 రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. గత సీజన్లలో నాగ్ సృష్టించిన రికార్డులతో పోలిస్తే సగానికి పడిపోయినట్టే లెక్క. అయితే రేటింగ్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. అదేరోజున ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉండటంతో బిగ్ బాస్-6 రేటింగ్ పై తీవ్ర ప్రభావం పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే సీజన్ సీజన్ కి బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గుతోంది. పైగా ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు తప్ప సాధారణ ప్రేక్షకులకు తెలిసినవారు పెద్దగా లేరు. గత సీజన్లతో పోల్చితే ప్రమోషన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. ఇలా పలు కారణాలతో బిగ్ బాస్ రేటింగ్ పడి పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.