English | Telugu
ఢీ షోకు ప్రదీప్ గుడ్ బై.. ఏం జరిగింది?
Updated : Jun 20, 2022
వెండితెరపై గ్రాఫిక్స్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన శ్యామ్ ప్రసాదరెడ్డి ఆగ్రహం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి చిత్రాలని నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకున్నారు. అయితే `అంజి` నిర్మాణం చాలా ఏళ్లు జరగడం.. రిలీజ్ కు టైమ్ పట్టడం వంటి కారణాలతో ఈ మూవీ వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో సినిమా నిర్మాణం పక్కన పెట్టి మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ లో బుల్లితెరపై టీవీ షోలు చేయడం మొదలు పెట్టారు. `మనసు మమత` సీరియల్ తో వీర జర్నీ మొదలైంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలతో పాపులర్ అయ్యారు.
చాలా మంది కమెడియన్ లని, యాంకర్ లని వెలుగులోకి తీసుకొచ్చారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలతో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో ఎంతో మంది కమెడియన్ లు వెలుగులోకి వచ్చారు. అయితే మల్లెమాల ఎదుగుదలకు కారణమై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ షోలు గత ఏడాది కాలంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ షోకు ఆయువు పట్టుగా నిలిచిన టీమ్ లీడర్స్ ఒక్కొక్కరుగా బయటికి వెళుతూ షాకులిస్తున్నారు.
ఇప్పటికే ఈ షో నుంచి చాలా మంది టీమ్ లీడర్లు బయటికి వెళ్లిపోయారు. కొన్ని నెలల క్రితం గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ కూడా వెళ్లి పోయారు. సుడిగాలి సుధీర్ `శ్రీదేవి డ్రామా కంపనీ`కి యాంకర్ గా వ్యవహరించేవాడు. ఇటీవల ఈ షో నుంచి కూడా బయటికి వచ్చేశాడు. అతని స్థానంలో యాంకర్ రష్మీని రంగంలోకి దింపారు. ఇక ఢీ షో ని కూడా మల్లెమాలే రన్ చేస్తోంది. ఈ షో నుంచి కూడా వారికి షాక్ తగిలింది. ఈ షో నుంచి తాజాగా యాంకర్ ప్రదీప్ వెళ్లిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఢీ షోకు కళ తప్పడం గ్యారెంటీ అని చెబుతున్నారు. గతంలో మల్లెమాల నుంచి బయటికి వెళ్లిన నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆ తరువాత నుంచి చాలా మంది ఈ సంస్థ రూపొందిస్తున్న షోల నుంచి క్రమ క్రమంగా దూరమవుతూ వస్తున్నారు.