English | Telugu

రాజ్ ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తీసుకొచ్చేదేంటని కావ్య డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.. అప్పు షాపింగ్ ఉందని మియాపూర్ వెళ్లాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. సరేనని బైక్ మీద అప్పుని తీసుకొని వెళ్తాడు కళ్యాణ్. మరోవైపు కనకంతో మాట్లాడుతూ మీనాక్షి టెన్షన్ పడుతుంటుంది. మీ ఇల్లు కంటే నరకమే మేలని కనకంతో మీనాక్షి అంటుంది. ఈ పేదరికం వల్ల నా మనసెప్పుడో రాయిలా మారింది అక్క అని కనకం అంటుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి మీనాక్షి వెళ్ళి.. మీకు స్టోర్ రూంలో ఏం పని లేదు కదా అని అడుగుతుంది. నాకేం పనిలేదు.. మీకు పనిలేదా అని కృష్ణమూర్తి అంటాడు. మీకు స్టోర్ రూంలో పని ఉంటే నాకు చెప్పండని కృష్ణమూర్తితో మీనాక్షి చెప్పి వెళ్ళి హాల్లో కూర్చుంటుంది.

కాసేపటికి కృష్ణమూర్తి బొమ్మలకు రంగులు వేసే బ్రష్ ఎక్కడుందోనని స్టోర్ రూంలో చూడటానికి వెళ్తుంటాడు. అక్కడే హాల్లో ఉన్న మీనాక్షి అతడిని గమనించి.. ఆగండి.. మీకు స్టోర్ రూంలో పని ఉంటే నాకు చెప్పండని చెప్పాను కదా అని మీనాక్షి అంటుంది. నా పని నన్ను చేసుకోనివ్వండని చెప్పి కృష్ణమూర్తి స్టోర్ రూంకి వెళ్ళి తన పెయింట్ బ్రష్ ల డబ్బా తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. స్టోర్ రూంకి వెళ్ళి మామూలుగా వచ్చిన కృష్ణమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన మీనాక్షి.. ఆ స్టోర్ రూంకి వెళ్ళి చూడగా అక్కడ సేట్ ఉండడు. అది చూసి షాక్ అయిన మీనాక్షి కంగారుగా కనకం దగ్గరికి వెళ్తుంది. సేట్ స్టోర్ రూంలో లేడని కనకంతో మీనాక్షి అనగా.. నాకు తెలుసని కనకం అంటుంది. మరి నాకు చెప్పలేదేంటి అని మీనాక్షి అంటుంది. నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడుతావని చెప్పలేదని కనకం అంటుంది.

మరోవైపు రాజ్ కార్ లో ఒక లగేజీ బ్యాగ్ ని ఎవరికీ తెలియకుండా తీసుకొస్తాడు. తాడుతో కట్టేసి బ్యాగ్ ని పైకి తీసుకెళ్తుంటే కావ్య, సుభాష్ చూస్తారు. రాజ్ తో దొంగచాటుగా ఏదో తీసుకొస్తున్నాడు. అదేంటో తెలుసుకోండని సుభాష్ తో చెప్తుంది కావ్య. రాజ్ మెళ్ళిగా ఆ బ్యాగ్ ని పైకి లాగుతుండగా వాళ్ళ నాన్న రావడంతో ఆ తాడుని వదిలేస్తాడు రాజ్‌. దాంతో కిందనే ఉండి రాజ్ కోసం చూస్తున్న సుభాష్ కి తగిలి పడిపోతాడు. కాసేపటికి కిందకి వస్తాడు రాజ్. స్పృహ తప్పి పడిపోయిన సుభాష్ ఒఐ నీళ్ళు చల్లి లేపుతాడు రాజ్. ఆ తర్వాత మెల్లిగా సుభాష్ ని డైవర్ట్ చేస్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.