English | Telugu

పశ్చిమ బెంగాల్ లో అక్రమ సొరంగం కూలి ఒకరు మృతి...

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది, అసన్సోల్ జిల్లాలో ఉన్న కుల్తీ కోల్ మైన్ లో బొగ్గు పెల్లలు కూలాయి. దీంతో ముగ్గురు వ్యక్తులు అందులో చిక్కుకున్నారు, వీరిలో ఒకరి మృతదేహాన్ని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఇటీవల నలుగురు వ్యక్తులు కోల్ మైన్ దగ్గర అక్రమంగా తవ్వకాలు చేపట్టారు, కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా ఎవరూ గమనించలేదు. ఓ సొరంగం తవ్విన తర్వాత దానికి ఎటువంటి ఆధారాన్ని ఉంచలేదు, దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు కుప్పకూలింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు, బయట ఉన్న మరో వ్యక్తి పారిపోయాడు. అయితే ముగ్గురు వ్యక్తులు లోనికి వెళ్ళిన తరవాత మిథేన్ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ తరవాత సొరంగ మార్గం కూలడం జరిగి ఉంటుందని ఈ సీ ఎల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసిన సిబ్బంది మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అక్రమంగా తవ్వకాలు జరిపేవారి గుట్టు రట్టయ్యే అవకాశముంది. అక్రమంగా తవ్వకాలు జరిపి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తూ అమాయక ప్రాణాలు బలిగొంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని వారికి కఠిన శిక్ష విధించాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి ఆగడాలకు మరోసారి పాల్పడకుండా చేయాలని కోరుతున్నారు.