English | Telugu
తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు...
Updated : Oct 18, 2019
నిన్న మొన్నటి దాకా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ వర్షాలతో.. ఊళ్లు సైతం వరదల్లో చిక్కుకు పోవటమే కాక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. మొన్ననే నైరుతి ఋతు పవనాలు వెనక్కు తగ్గాయన్న వాతవరణ శాఖ సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. కానీ రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నీ నీట మునుగుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో భారీగా వర్షాలు ముంచెత్తాయి. దీంతో వాగులు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది.
నీలగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రవాణా స్తంభించి పోయింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఊటీ కొండల్లో భారీ వర్షం కారణంగా మూడు రోజుల పాటు పర్యాటక రైళ్లు రద్దు చేశారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు ఉండటంతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ఇక భవాని సాగర్ డ్యామ్ పూర్తిగా నిండి పోవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ అప్రమత్తం చేశారు. మరోవైపు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారీ వర్షాలతో కొడివేరి డ్యామ్ కు వరద నీరు పోటెత్తింది. దీనితో డ్యామ్ అన్ని గేట్లను పైకి ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. వర్షాల బారి నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతారో వేచి చూడాలి.