English | Telugu
మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం...
Updated : Oct 18, 2019
తాత్కాలిక మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచార యత్నం చేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరిట తెలంగాణా ప్రభుత్వం నడిపిస్తున్న బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు మంచిర్యాల నుంచి ఒక మహిళా కండక్టర్, డ్రైవరు చెన్నూరు వైపు వెళ్లారు. రాత్రి తిరిగి చెన్నూరు నుండి ఏడున్నర గంటల ప్రాంతంలో మంచిర్యాల వస్తుండగా మార్గ మధ్యంలో అటవీ ప్రాంతలో మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్ అత్యాచార యత్నం చేశాడు.
చెన్నూరు నుండి మంచిర్యాల దారి మధ్యలో ఉన్న స్టాపుల్లో బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు సిధ్ధంగా ఉన్నా కూడా ఎక్కడా బస్సు నిలపకుండా ఓ పథకం ప్రకారం అతను మితిమీరిన వేగంతో అటవీ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలో బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి అతన్నుంచి తప్పించుకునేందుకు బిగ్గరగా అరవడంతో.. జయపూర్ సమీపంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో స్థానికంగా ఉన్న కొందరు గమనించారు. జయపూర్ బస్టాప్ చేరుకునే సరికి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో వారంతా అక్కడికి చేరుకొని మహిళా కండక్టర్ ను కాపాడటం జరిగింది. పోలీసులు వెంటనే డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారయత్నం కాదు అని కేవలం అసభ్యంగా ప్రవర్తించాడని అక్కడి పోలీసులు అంటున్నారు. బాధితురాలు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సంకోచించింది ఎందుకంటే ఈ విషయం బయట తెలిస్తే తనకు పరువు ఏమవుతుందో అని ఆలోచించి వెనుకాడిందని పోలీసులు చెప్తున్నారు.