English | Telugu

రవితేజ ట్రాక్ లో పడ్డాడు.. ఆ రెండు చిత్రాలు కూడా హిట్ అవుతాయా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు చాలా చిత్రాలు నిరాశ పరచగా ఎట్ట‌కేలకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన క్రాక్ మూవీ మరలా అతన్ని ట్రాక్ లోకి తెచ్చింది. మంచి వ‌సూళ్ల‌ను సాధించి మంచి హిట్ అయిన ఈ చిత్రం రవితేజ హిట్ లిస్ట్‌ లో చేరింది. కానీ ఆ తర్వాత ఆయన ఎంతో నమ్మకంగా చేసిన ఖిలాడి, రామారావు ఆన్‌ డ్యూటీలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇదే సమయంలో త్రినాధరావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ ధమాకా అనే చిత్రం చేశారు. ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి ఓ మోస్త‌రు టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుని పోతుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. దాంతో రవితేజ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చేసాడని చెప్పాలి. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ వసూలను రాబట్టడంతో ఆయన నిర్మాతలతో పాటు తదుపరి చిత్రాల నిర్మాతలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక జనవరి 13న ఆయన మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో రవితేజ నిడివి చాలా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం గనుక సక్సెస్ అయితే అది మరింత గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ‌ 'టైగర్ నాగేశ్వరరావు' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకుడు. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంపై ఇటీవల రవితేజ చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం పాన్ ఇండియాలో స్థాయిలో ఆడుతుందని, తనకు పాన్ ఇండియా సినిమాలంటే ఒక అభిప్రాయం ఉందని, టైగర్ నాగేశ్వరరావు ఆ కోవ‌కు చెందిన చిత్రం అని చెప్పి ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచేశారు. అందులోనూ టైగర్ నాగేశ్వరరావు క‌థ‌ వాస్తవిక ఘటనల‌ ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అందరికీ ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఒకనాటి స్టువ‌ర్ట్‌పురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఏమిటి? ఆయన ఎలాంటి పనులు చేసేవాడు? ఆయన వ్యక్తిత్వం ఏమిటి? ప్రజలు ఆయన అంతగా ఆరాధించడానికి, పోలీసులు ఆయనను కట్టడి చేయడానికి ఎందుకు ప్రయత్నించారు? వంటి విషయాలను ఈ త‌రం ప్రేక్షకులకు తెలియజేసే చిత్రమే. వాస్తవికంగా తీస్తే ఈ చిత్రం నుంచి నేటి త‌రానికి ఉన్న చాలా సందేహాలకు ఈ మూవీ సమాధానం చెబుతుంది.

ఈ చిత్రంతో పాటు రవితేజ రావణాసుర అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. సుధీర్ వర్మ విషయానికి వస్తే తెలుగులో స్వామి రారా చిత్రంతో 2013లో ఆయన దర్శకునిగా ఎంట్రీ ఇచ్చి తాను పెద్ద హిట్టు కొట్ట‌డ‌మే కాదు... యంగ్ హీరో నిఖిల్‌కి కూడా మంచి విజయాన్ని అందించారు. ఆ తర్వాత ఆయన నాగచైతన్య హీరోగా తీసిన దోచేయ్ చిత్రం సరిగా ఆడలేదు. మరలా నిఖిల్ తో కేశవ అనే చిత్రం తీసి మంచి హిట్‌ కొట్టారు. కన్నడ కిర్రాక్ పార్టీకి రీమేక్ గా అదే టైటిల్ తో ఓ చిత్రం తీశాడు కానీ అది రచయితగా మాత్రమే. శర్వానంద్ తో తీసిన రణరంగం చిత్రం పెద్దగా ఆడలేదు. సూపర్ ఓవర్ చిత్రాన్ని ప్రవీణ్ వర్మ దర్శకత్వంలో సుధీర్ వ‌ర్మ నిర్మాతగా రూపొందించారు. అలాగే దర్శకుడిగా శాఖిని డాఖిని అనే సినిమా కూడా చేశాడు కానీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆయన రవితేజ తో రావణాసుర వంటి క్యూరియాసిటీ కలిగించే టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ధ‌మాకా సూప‌ర్ హిట్‌ తరువాత అందులో వాల్తేరు వీరయ్య కూడా హిట్ అయితే రవితేజ తదుపరి సినిమాల విషయంలో కూడా ప‌లు జాగ్రత్తలు తీసుకోవడం ఖాయం. ఇప్పటికే ఆ దిశగా అతను ప్రయత్నాలు మొదలు పెట్టాడని అంటున్నారు. రావణాసుర డిఫరెంట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో అతను విభిన్నమైన గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. వెంట వెంటనే రవితేజ సినిమాల హడావుడి ఉండడంతో ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టకూడదని భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఊపు తగ్గిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసురల చిత్రాల ప్రమోషన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇక రావణాసుర సినిమాకు సంబంధించి షూటింగ్, తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. ఇందులో రవితేజకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. కేవలం కొన్ని సాంగ్స్ కు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో మిగిలిన పార్ట్‌ని కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కాలంలోనే తీసుకొని రానున్నారు. మరి ఈ చిత్రం రవితేజకు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో వేచిచూడాలి.