English | Telugu

సినిమా రిలీజ్‌కి ఇంకా రెండు రోజులే ఉంది.. నాకు భయంగా ఉంది!

విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘కింగ్డమ్‌’ మూవీ జూలై 31న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జూలై 28న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విజయ్‌ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తోపాటు చిత్రంలో నటించిన కొందరు నటీనటులు, టెక్నీషియన్స్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈరోజు జూలై 28. మరో రెండు రోజుల్లో మా సినిమా రిలీజ్‌ కాబోతోంది. నాకు భయంగా ఉంది. అదే సమయంలో ఒక మంచి సినిమా చేశానన్న తృప్తి ఉంది. ఇక్కడికి నేను వచ్చింది మీ అందరితో మాట్లాడడానికే. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్టయినా ప్లాప్‌ అయినా అదే ప్రేమ చూపిస్తున్నారు. నా మీద మీకు అంత నమ్మకం ఉంది. ఈరోజు ఉదయం 2000 మంది ఫ్యాన్స్‌ను కలిశాను. నాకు దాదాపు 1500 మెసేజ్‌లు వచ్చాయి. ‘అన్నా మనం ఈసారి కొడుతున్నాం’, ‘అన్నా మనం కొట్టాలన్నా’, ‘మనం టాప్‌లో కూర్చుంటున్నాం అన్నా’ అని అంటున్నారు. మన సినిమా అని మీరంతా నన్ను ఓన్‌ చేసుకున్నారు. ఏ సినిమాలు హిట్‌ అవుతాయో, ఏవి ప్లాప్‌ అవుతాయో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను మీ వాడిగా చేసుకున్నారు. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ మీ లైఫ్‌లో ఏదో ఒకటి పాజిటివ్‌గా చేసే పోతాను.

పోస్టర్ల మీద విజయ్‌ దేవరకొండ కింగ్డమ్‌ అని ఉంది కానీ.. ఇది గౌతమ్‌ తిన్ననూరి కింగ్డమ్‌. ఈ స్టోరీ అనుకున్నప్పటి నుంచి దానిపైనే వర్క్‌ చేస్తున్నాడు. అలాగే అనిరుధ్‌ రవిచందర్‌, నవీన్‌ నూలి, నాగవంశీ, అవినాష్‌ కొల్లా, నీరజ కోన.. వీళ్ళంతా సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు. నాలో ఎప్పుడూ ఒక ఫైర్‌ ఉంటుంది. ఈసారి నాతో పాటుగా ఇంతమంది ఫైర్‌ ఉన్న మనుషులు దొరికారు. భాగ్యశ్రీ కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. ఆమె చాలా దూరం వెళ్తుంది. సత్యదేవ్‌, వెంకటేష్‌ చాలా మంచి యాక్టర్స్‌. వెంకటేష్‌ సూపర్‌స్టార్‌ అవుతాడు’ అన్నారు విజయ్‌ దేవరకొండ.