English | Telugu

సమంత కోసం 'మధుబాల'గా మారిన జయమ్మ!

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా 'యశోద'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో హరి-హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నారు.

'యశోద' సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో 'మధుబాల' అనే పాత్రలో ఆమె కనిపించనుందని మేకర్స్ ప్రకటించారు. విభిన్న పాత్రలతో సౌత్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ. 'క్రాక్' సినిమాతో జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ 'యశోద'తో 'మధుబాల'గా అలరించడానికి సిద్ధమవుతోంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. "సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రం 'యశోద' చిత్రీకరణ ఈ నెల 6న ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రలో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్ కనిపిస్తారు. నేటి నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. నిర్విరామంగా చిత్రీకరణ చేసి.. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది" అని చెప్పారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.