English | Telugu

2010లో రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత 60 సినిమాలు చెయ్యడానికి రీజన్‌ ఇదే!

- నయనతార చివరి చిత్రం శ్రీరామరాజ్యం

- పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై

- ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్ కావడానికి రీజన్ ఇదే

టాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్లుగా నటించేవారు ఎక్కువ శాతం ఇతర భాషల నుంచి వచ్చినవారే. తెలుగు వారు స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలా తక్కువనే చెప్పాలి. పాతతరం హీరోయిన్లను పక్కన పెడితే మధ్యతరంలో వచ్చిన శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి హీరోయిన్లు కొంతకాలం టాలీవుడ్‌ని ఏలారు. వీరి తర్వాత విజయశాంతి, భానుప్రియ వంటివారు టాప్‌ హీరోయిన్లుగా కొంతకాలం రాణించారు. ఇక రాధ, రాధిక టాప్‌ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వీరు పరభాషా నాయికలే. వీరి తర్వాత తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌లో కనిపించలేదు.

Also Read:ఐబొమ్మ రవి కంటే పెద్ద దొంగలు వాళ్లే.. సినిమా పైరసీకి బాధ్యులు వాళ్లే!

ఆ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్ల హవా కొంతకాలం కొనసాగింది. వారి తర్వాత త్రిష, నయనతార వంటి పరభాషా హీరోయిన్లు దశాబ్దాలుగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నయనతార సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. 2003లో మలయాళ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన నయనతార.. ఆ తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో టాప్‌ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన కెరీర్‌ ప్రారంభించిన 7 సంవత్సరాల్లోనే హీరోయిన్‌గా రిటైర్‌ అవుతున్నట్టు 2010లో ప్రకటించారు నయనతార.

నందమూరి బాలకృష్ణ శ్రీరాముడుగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరామరాజ్యం’ తన చివరి చిత్రమని, ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ, ఈ సినిమా తర్వాత తన నిర్ణయం మార్చుకొని హీరోయిన్‌గా కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 60 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు నయనతార. రిటైర్‌మెంట్‌ ప్రకటించిన తర్వాత మళ్ళీ హీరోయిన్‌గా కొనసాగి సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

2010లో ‘శ్రీరామరాజ్యం’ షూటింగ్‌ మొదలైన తర్వాత అదే తన చివరి చిత్రం అనే ఆలోచనలోనే ఉన్నారు నయనతార. ఎందుకంటే ఆ సమయంలో నటుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలు వదులుకోవాలని ప్రభుదేవా కండిషన్‌ పెట్టారు. దానికి అనుగుణంగానే నయన్‌ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించింది. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లయింది. అతను రెండో పెళ్లి చేసుకోవడాన్ని అతని భార్య వ్యతిరేకించారు. నయనతార వైఖరి పట్ల పలు మహిళా సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. దాంతో ప్రభుదేవాతో తెగతెంపులు చేసుకున్నారు నయనతార.

Also Read: అసలైన దొంగలను వదిలేశారు.. రవిని అరెస్ట్‌ చేశారు.. ప్రశ్నిస్తున్న మూవీ లవర్స్

ప్రభుదేవాతో పెళ్లి క్యాన్సిల్‌ కావడంతో తిరిగి సినిమాలపై దృష్టిపెట్టారు నయనతార. అలా మళ్ళీ నటిగా కొనసాగారు. దానికి తగ్గట్టుగానే సౌత్‌లోని అన్ని భాషల్లో చాలా మంచి పాత్రలు ఆమెకు లభించాయి. అలా స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్నారు. 2022లో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు నయనతార. పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగుతున్నారు. 2023లో షారూక్‌ ఖాన్‌ హీరోగా వచ్చిన ‘జవాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి సరసన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం అరడజను సినిమాలతో 41 ఏళ్ళ వయసులోనూ హీరోయిన్‌గా బిజీగా ఉన్నారు నయనతార.