English | Telugu

'లియో' మేటర్ లీక్ చేసిన ఉదయనిధి స్టాలిన్

'లియో' మేటర్ లీక్ చేసిన ఉదయనిధి స్టాలిన్

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లియో'. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 19న విడుదల కానుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటన తర్వాత తమిళనాడుతో పాటు మిగతా చోట్ల కూడా లోకేష్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ యూనివర్స్ లో 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలు రాగా రెండూ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా గతేడాది వచ్చిన 'విక్రమ్' సంచలన వసూళ్ళతో రికార్డులు సృష్టించింది. అందుకే 'విక్రమ్' తర్వాత లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న 'లియో'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇది 'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా కావడం విశేషం. అయితే 'లియో' మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కదా? అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పుడు సస్పెన్స్ కి నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెరదించారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ 'లియో'కి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. అలాంటిది 'లియో' సినిమా గురించి ఉదయనిధి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ అన్న లియో సినిమా బాగుందని, దర్శకుడు లోకేష్ అద్భుతంగా తెరకెక్కించారని ఉదయనిధి ట్వీట్ చేశాడు. మూవీ టీంకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఇది LCU(లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగమని హింట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. లియో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగమని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.