English | Telugu
The Girl friend movie review: ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ
Updated : Nov 6, 2025
సినిమా పేరు: ది గర్ల్ ఫ్రెండ్
తారాగణం:రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి, రాహుల్ రవీంద్రన్ తదితరులు
మ్యూజిక్: హేషం అబ్దుల్ వహబ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
రచన, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
సినిమాటోగ్రాఫర్: కృష్ణన్ వసంత్
బ్యానర్స్ :గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాత: అల్లు అరవింద్, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
విడుదల తేదీ: నవంబర్ 7 2025
పాన్ ఇండియా హీరోయిన్ 'రష్మిక'(Rashmika mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్(The Girl freind). రిలీజ్ డేట్ ఈ రోజే అయినా సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిన్నటి నుంచే ప్రీమియర్స్ తో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
భూమా(రష్మిక) ఎంఏ లిటరేచర్ స్టూడెంట్. కాలేజీ లో చదువుకుంటూ అదే కాలేజీ క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటుంది. నెమ్మదస్తురాలితో పాటు బిడియం, మొహమాటం కలగలిపిన యువతి. ఎడ్యుకేషన్ తప్ప వేరే వ్యాపకం లేదు. విక్కీ (దీక్షిత్ శెట్టి) అదే కాలేజీలో ఎంఏ సైన్స్ స్టూడెంట్. ప్రతిదీ తన కంట్రోల్ లో ఉండాలనుకునే దుడుకు స్వభావం కలిగిన యువకుడు. దుర్గ(అనూ ఇమ్మాన్యుయేల్) కి ఎప్పట్నుంచో విక్కీ పై క్రష్ ఉంటుంది. విక్కీ మాత్రం భూమాని తన గర్ల్ ఫ్రెండ్ గా నిర్ణయించుకుంటాడు. భూమా లైఫ్ ని కూడా డిసైడ్ చేస్తుంటాడు. ఆ క్వాలిటీ భూమాకి నచ్చకపోయినా విక్కీ ని బాయ్ ఫ్రెండ్ గా స్వీకరిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా ఒక్కటవ్వుతారు. కానీ ఆ తర్వాత విక్కీ విషయంలో భూమా ఒక నిర్ణయం తీసుకుంటుంది. విక్కీ విషయంలో భూమా తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయం తర్వాత భూమా విషయంలో విక్కీ ప్రవర్తన ఏంటి? ఆ ప్రవర్ధన యొక్క తీరు ఎలా ఉంది? ఈ కథలో దుర్గ క్యారక్టర్ పయనం ఎటు? అసలు భూమా పై విక్కీ కి ఉంది ప్రేమేనా! చివరకి భూమా క్యారక్టర్ ఎలా ముగిసింది? అనేదే ది గర్ల్ ఫ్రెండ్ చిత్ర కథ.
ఎనాలసిస్
ఇలాంటి కథలు ప్రస్తుత జనరేషనే కాదు ఎప్పట్నుంచో వయసులో ఉన్న యువతి యువకుల నిజ జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ మధ్య పరిచయాలు ఎలా ఏర్పడతాయి. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నపుడు తనకి తెలియకుండానే ఒక అబ్బాయి ఆకర్షణలో పడి దాన్నే ప్రేమ అని ఎలా అనుకుంటుందో కూడా ఈ చిత్రం చెప్పినట్లయింది. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది యువతి యువకుల మధ్య ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా గెలుస్తుంది కదా. అందుకే ఈ కథలోని క్యారెక్టర్స్ మధ్య ఆకర్షణే కనపడుతుంది.స్త్రీ,పురుషుల మధ్య జరిగే కలయిక ఎంతో పవిత్రమైనది. ఆ కలయికే స్వచ్ఛమైన ప్రేమకి పునాది. ఆ ఇద్దరి నిండు నూరేళ్ళ జీవితానికి కూడా అంకురార్పణ.
కానీ ఆ కలయిక కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది కథ యొక్క ఉద్దేశ్యం వేరే అయ్యి ఉండవచ్చు. కానీ శారీరకంగా కలిసిన దానికి కూడా జస్టిఫై ఇచ్చి ఉండాల్సింది. అలా ఇవ్వకపోవడం వలన యువతి, యువకులు శారీరకంగా కలవడం పెద్ద తప్పు కాదని చెప్పినట్లయింది. దీంతో ప్రస్తుత సొసైటీ కి రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే భూమా, విక్కీ ల ఇంట్రడక్షన్ సీన్ దగ్గర్నుంచి కాలేజీ లో వచ్చే అన్ని సన్నివేశాలు మనం చాలా సినిమాల్లోనే చూసాం. భూమాని తన గర్ల్ ఫ్రెండ్ గా చేసుకోవడానికి విక్కీ ఎన్నో ఇబ్బందులని పేస్ చేసినట్టుగా చూపించాల్సింది. ఆ విధంగా చెయ్యకపోవడం వలన విక్కీ పరిచయమవ్వడం ఆలస్యం భూమా అతనితో ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా అనిపించింది. పైగా భూమాతో ఫ్రెండ్ షిప్ కోసం విక్కీ ఇబ్బందులు పడే ప్రాసెస్ లో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ జనరేట్ అయ్యేది.
ఒక సందర్భంలో విక్కీతోనే భూమా మాట్లాడుతు నా కోసం ట్రై చెయ్యకు అసలు పడనని అంటుంది కూడా. విక్కీ తో భయంగా ఉంటునే అతనితో తిరగడం అనేది అంతగా సెట్ అవ్వలేదు. ఇద్దరి మధ్య సూపర్ గా వచ్చిన సీన్స్ కూడా లేవు. దుర్గ క్యారక్టర్ ని కూడా ఎక్కువ ఉపయోగించుకున్నది లేదు. ఇంటర్వెల్ లో పెద్దగా ట్విస్ట్ లేకపోయినా భూమా, విక్కీ తో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి బాగానే అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ చూసుకుంటే భూమా, విక్కీ మధ్య వచ్చిన సన్నివేశాల్లో కొంచం క్లారిటీ వచ్చింది. ఆ రెండు క్యారెక్టర్స్ ఎలా ముగుస్తాయనే క్యూరియాసిటీ, భూమా తండ్రి రాకతో ఏర్పడింది. కాకపోతే బలమైన సీన్స్ సృష్టించకుండా భావోద్వేగాలకి వాల్యూ ఇవ్వడంతో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
ముఖ్యంగా భూమా, ఆమె తండ్రి మధ్య వచ్చే సీన్ తో పాటు ఆ సందర్భంగా తండ్రి చెప్పే డైలాగ్స్ నేటి యువతరానికి గట్టిగానే తగులుతాయి. తండ్రి క్యారక్టర్ ని చివరిదాకా అదే టెంపో తో నడుపుతూ సీన్స్ వచ్చి ఉంటే కొద్దిగా రిలీఫ్ ఉండేది. ప్రీ క్లైమాక్స్ ని ఇంటర్ వెల్ లోనే సెట్ చేసుకుని భూమా పోరాటం మొదలు పెడితే, నేటి తరం అమ్మాయిలకి దైర్యంగా ఎలా ఉండాలో చెప్పినట్లయ్యేది. ఓవర్ ఆల్ గా సినిమా మొత్తంపై చూసుకుంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
భూమా గా రష్మిక మరోసారి తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించింది. తను ఎన్ని సినిమాలు చేసినా గర్ల్ ఫ్రెండ్ మాత్రం తన సినిమాల లిస్ట్ లో ఒక బెస్ట్ మూవీ గా ఉంటుంది. ముఖ్యంగా క్లోజ్ షాట్స్ లో తన యాక్టింగ్ సూపర్. విక్కీ గా దీక్షిత్ శెట్టి(Deekshit Shetty)బాగానే చేసినా తను కాకుండా ఇంకో యువ నటుడు అయితే బాగుండేదేమో. మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా రావు రమేష్, అను ఇమ్మానియేల్ తమకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారు.
హేషం అబ్దుల్ మ్యూజిక్ లో మెరుపులు లేవు. కానీ విహారి అందించిన బిజీఎం మాత్రం క్యారెక్టర్స్ యొక్క భావోద్వేగాలకి మరింతగా ఎలివేషన్ ఇచ్చింది. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ కథకుడు గా మాత్రం నామమాత్రపు ప్రదర్శననే కనపరిచాడు. నిర్మాణ విలువల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా మొత్తాన్ని ఒక కాలేజీ లోనే తెరకెక్కించారు. కాకపోతే ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో ఆ ఛాయలు మనకి కనిపించవు. ఎడిటింగ్ ఇంకో ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఫైనల్ గా చెప్పాలంటే ఆసక్తికరమైన కథ అయినా కథనం స్లో గా నడిచింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్. రష్మిక పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్.
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం