English | Telugu
స్వప్న సుందరి మూవీ రివ్యూ
Updated : May 12, 2023
మూవీ: స్వప్న సుందరి
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్, రెడిన్ కింగ్స్లే, సతీష్ కృష్ణన్, షారా, థెండ్రల్, బిజోర్న్, అగస్టిన్, మనితన్ వెంకట్, వెట్రివల్ రాజా తదితరులు
సినిమాటోగ్రఫీ: బాల మురుగన్
సంగీతం: అజ్మల్ తహసీన్
ఎడిటర్: కె. శరత్ కుమార్
నిర్మాతలు: బాలాజీ, వివేక్ రవిచంద్రన్
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: ఎస్ జి చార్లెస్
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది ఐశ్వర్య రాజేష్. అయితే ఎస్ జీ చార్లెస్ దర్శకత్వంలో ఆమె నటించిన కామెడీ డ్రామా మూవీ 'స్వప్న సుందరి'. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం.
కథ:
ఎస్జీసీ జ్యువెలర్స్ మేనేజర్ వాళ్ళ స్టాఫ్ ని పిలిచి.. ఈ అక్షయ తృతీయకు మనకి అన్నీ షోరూంలలో మంచి లాభాలు వచ్చాయి.. అయితే అందులో కొన్ని కూపన్ లు తీసుకున్నాం కదా.. అందులో లక్కీ డ్రా నుండి అయిదుగురిని సెలక్ట్ చేశాను. ఆ అయిదుగురికి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చి వాటిని రికార్డ్ చేసి నాకు ఒక ఫిల్మ్ లా తీసుకురండని వారికి చెప్తాడు. అలా ఆ స్టాఫ్ ఒక్కొక్కరికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటారు. నలుగురికి ఒక్కో గిఫ్ట్ ఇచ్చాక.. చివరి గిఫ్ట్ అహల్య(ఐశ్వర్య రాజేశ్) కి వస్తుంది. అహల్య అదే ఎస్జీసీ జ్యువెలర్స్ షాప్ లో ఒక స్టాఫ్ గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటుంది. అహల్య వాళ్ళ నాన్న పక్షపాతం వచ్చి మంచాన పడి ఉంటే, తల్లి సేవలు చేస్తుంటుంది. అహల్యకి ఒక అక్క ఉంటుంది. తనకి మాటలు రావు. అయితే అహల్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ గా కార్ వస్తుంది. దాంతో అహల్య వాళ్ళ అక్కకి పెళ్ళిచూపులు జరుగుతాయి. ఆ పెళ్ళి కోసం పెళ్ళి కొడుకుకి కార్ ని కట్నంగా ఇద్దామనుకుంటారు. అహల్య వాళ్ళ అక్క, తనని పెళ్ళి చేసుకోవాలనుకున్నవాడు కలిసి కార్ లో వెళ్తుండగా.. ఒక దగ్గర అతను కార్ ఆపి, అహల్య వాళ్ళ అక్కని కార్ నడపమంటాడు. అయితే తనకి కార్ నడపడం రాకపోయేసరికి రోడ్డు మీద పోయే ఒక అతడిని గుద్దేస్తుంది. దాంతో అతడు చనిపోతాడు. ఇక వాళ్ళు అతడిని కార్ డిక్కీలో వేసుకొని వాళ్ళింటికి వెళ్తారు. ఆ తర్వాత రోజు అహల్యకి నిజం తెలుస్తుంది. అయితే అదే రోజు
అహల్య వాళ్ళ అన్న దొర కార్ కోసం వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడతారు. దాంతో గొడవని ఆపుతూ పోలీసులు వచ్చి కార్ ని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత అహల్య ఆ కార్ ని తిరిగి పొందగలిగిందా? అహల్య వాళ్ళ అక్క పెళ్లి జరిగిందా లేదా అనేదే మిగతా కథ..
విశ్లేషణ:
ఓటిటిలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన 'డ్రైవర్ జమున' సినిమాతో హిట్ కొట్టిన 'ఐశ్వర్య రాజేష్'.. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త కథతో వచ్చింది. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని తను పోషిస్తున్న అహల్య పాత్రతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది.
ఈ సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేవు. అలా సాగిపోతుంది. సినిమా చివరిదాకా ఒకే విధంగా ఉంటుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించదు.. స్లో సీన్స్ అసలే లేవు. సినిమా నిడివికి ఈ కథ అలా సెట్ అయిపోయింది. సమాజంలో మధ్యతరగతి వాళ్ళకి లక్కీ డ్రాలో ఏదైనా లాటరీ తగిలితే వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపిస్తూ అహల్య, వాళ్ళ అమ్మ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే వారికి అలా వచ్చిన లాటరీతో ఆశ కాస్త అత్యాశగా మారితే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో చూపించిన తీరు బాగుంది.
ఇక అహల్యకి నాన్న ఉన్నా లేనట్టే.. అయితే అలాంటి పరిస్థితులలో అహల్య వాళ్ళ అన్న వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం, మాటలు రాని చెల్లికి పెళ్ళి చేయకుండా తన దారి తను చూసుకోవడం.. ఇక అహల్య కుటుంబ భారాన్ని మోస్తూ.. వచ్చిన డబ్బులు సరిపోకపోయిన తను ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని పోషించడంతో ఈ కథకి ఊపిరి పోసింది.
అహల్య అన్నగా దొర తన స్వార్థాన్ని చూసుకున్నా, తను వెనకడుగు వేయలేదు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వక్రబుద్దితో చూసిన సరే తను ధైర్యంగా ఎదురుతిరిగింది అహల్య. తన పాత్రలో మాదిరిగానే బయట సమాజంలో ప్రతీ అమ్మాయికి బస్ స్టాప్ ల లో, రోడ్ల మీద, కాలేజీలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి వక్రబుధ్ది గల వాళ్ళు తారసపడతారని అహల్య పాత్రలో చూపించి మంచి సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్.
కథలో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉన్న పాత్రలతోనే మంచి కామెడీని పంచాడు డైరెక్టర్. ఏ పాత్ర ఎందుకు ఉందోనని కాకుండా ప్రతీ పాత్రకి ప్రాధాన్యతని ఇస్తూ చివరివరకు వినోదాన్నిస్తుంది ఈ 'స్వప్న సుందరి'. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సీన్ అండ్ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యేలా సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ సరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఐశ్వర్య రాజేష్.. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలో అహల్య పాత్రలో తను ఒదిగిపోయింది. ఫ్యామిలికి మంచి సపోర్ట్ ఇచ్చే అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది. అహల్యకి అక్కలా లక్ష్మీప్రియ ఆకట్టుకుంది. అహల్య అన్న దొరగా చంద్రమౌళి బాగా చేశాడు. ఇలా ప్రతీ ఒక్కరు తమ తమ పాత్రలలో బాగా ఆకట్టున్నారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
మంచి కథాంశంతో పాటుగా వినోదాన్ని అందించిన ఈ 'స్వప్న సుందరి' ని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు.
రేటింగ్: 3/5
✍🏻. దాసరి మల్లేశ్