English | Telugu

బాలయ్యగారి నటనలో, యాక్షన్‌లో ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది!

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్స్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే హ్యాట్రిక్‌ సాధించిన ఈ జంట.. రెండో హ్యాట్రిక్‌ శ్రీకారం చుట్టేందుకు ‘అఖండ2 తాండవం’ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవుతున్న ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ను కర్ణాటకలో ప్రేక్షకులు, అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు. కన్నడ స్టార్‌ హీరో డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘మా బ్రదర్‌ బాలయ్య గారి అఖండ 2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఒకే కుటుంబం. మేమిద్దరం బ్రదర్స్‌లాగే ఉంటాము. బాలయ్యగారి నటన, డైలాగులు, యాక్షన్‌లో ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంత వర్షంలో కూడా అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మీ అభిమానానికి ఆ వర్షం కూడా ఆగింది. ఈవెంట్‌ అద్భుతంగా జరిగింది. మీ అందరి ప్రేమ, నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాము. ఈ సినిమా మీ అందరినీ ఎంతగానో అలరిస్తుంది’ అన్నారు.

డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది శివతత్వంతో ఉన్న అద్భుతమైన సినిమా. శివన్న చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ని లాంచ్‌ చేయడం మేము చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాం. ఇంత వర్షంలో కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నాను. మీరు చూడబోయే సినిమా ఎలా ఉంటుందంటే... దేశాన్ని అపకీర్తిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ధర్మమనే త్రిశూలం పట్టుకుని యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అఖండ తాండవం మీరు చూస్తారు. ఈ సక్సెస్‌ మీట్‌ కూడా ఇక్కడే పెడతాం’ అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ ‘ట్రైలర్‌ని లాంచ్‌ చేసి మమ్మల్ని ఆశీర్వదించిన శివన్నగారికి థాంక్యూ. ట్రైలర్‌ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. బోయపాటిగారితో సరైనోడు సినిమాలో పనిచేశాను. మళ్ళీ ఆయన కాంబినేషన్లో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. బాలయ్యగారు, బోయపాటిగారి కాంబినేషన్‌ అద్భుతం. ఈ సినిమా మామూలుగా ఉండదు. సినిమా మొదలైనప్పుడు నేల టికెట్‌లో కూర్చున్న వాళ్ళు పూర్తయ్యేసరికి బాల్కనీలో ఉంటారు. అంతటి ఎనర్జీ ఈ సినిమాలో ఉంది’ అన్నారు.

హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ ‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. బోయపాటిగారి సినిమాలో చేయడం నా అదృష్టం. బాలయ్యగారితో కలిసి పనిచేయడం ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ఎలాంటి టెన్షన్‌ లేకుండా చాలా సరదాగా గడిచింది. డిసెంబర్‌ 5న అందరూ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ ‘మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యఅతిథిగా వచ్చిన శివరాజ్‌కుమార్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ఉత్సాహం కోసమే మేం ఎంతో కష్టపడి సినిమా చేశాం. డిసెంబర్‌ 5న అంతా అఖండ తాండవ శబ్దమే’ అన్నారు.