English | Telugu

అనామికకు భయపడుతున్న శేఖర్

'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపిడేస్' వంటి ఆహ్లాదకరమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం 'అనామిక' చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. వచ్చే నెల 1వ తేదిన విడుదల. హిందీలో విజయం సాధించిన 'కహానీ' చిత్రానికి రీమేక్ ఇది. అయితే ఇలాంటి రీమేక్ చిత్రాలను మరోసారి తీయకూడదని శేఖర్ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

"నాకు నేనుగా కథ రాసుకొని సినిమా తీయడంలోనే సంతృప్తి ఉంది. ఇలా వేరే భాషలో వచ్చిన సినిమా కథను మార్చి రాసుకోవడంలో చాలా కష్టం ఉంది. పైగా సంతృప్తి కూడా లేదు. ఇకపై ఎలాంటి రీమేక్ సినిమాలు చేసే ప్రసక్తి లేదు. ఈ సినిమా చేయమని నిర్మాతలే నన్ను వచ్చి అడిగారు. మంచి కథతో నా దగ్గరికి వచ్చేసరికి కాదనలేకపోయాను. పైగా హిందీలో విద్యాబాలన్ గర్భవతిగా నటించింది. ఆ పాత్రను అలాగే చూపిస్తే గర్భవతి పడిన కష్టాలు అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఒక స్త్రీ తన భర్త కోసం ఎలాంటి కష్టాలు పడింది అనేది తెలియజేయడానికే కథలో మార్పులు చేసాం. దీని వల్ల కథ మరింత ఆకర్షణీయంగా తయారైంది" అని తెలిపారు.

అసలే 'లీడర్', 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' వంటి వరుస ఫ్లాప్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ 'అనామిక' సినిమాపైనే దర్శకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయం పట్ల దర్శకుడికి అంతగా నమ్మకం లేనట్లుగానే అనిపిస్తుంది. అందుకే మరోసారి రీమేక్ సినిమాలు చేయను అని చెపుతున్నాడు. ఏదేమైనా 'అనామిక' తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.