English | Telugu

నా శ‌వాన్ని ఇండ‌స్ట్రీ వాళ్ల‌కి చూపించొద్ద‌ని చెప్పా!

రైట‌ర్‌, నటుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి ఇప్పుడు రాజ‌కీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో పోసాని త‌న కుటుంబం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న త‌న చావు గురించి మాట్లాడారు. ‘‘నాకు 63 ఏళ్లు, మా ఆవిడ‌కు 60 ఏళ్లు. జీవితంలో పెద్ద‌గా ఆశ‌లేవీ లేవు. అందువ‌ల్ల ఏదో అయిపోతుంద‌నే దిగులు, భ‌యం, అభ‌ద్ర‌తా భావం లేదు. నేను ముందుగా చ‌చ్చి పోతా. అలా చ‌నిపోతే నా శ‌వాన్ని కూడా ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు చూపించొద్ద‌ని మా ఆవిడ‌కు చెప్పాను. నా కార‌ణంగా ఎవ‌రూ ఏడ‌వ‌కూడ‌దు. నా శ‌వం మీద ఎవ‌రూ సానుభూతి చూపించ‌టం నాకు ఇష్టం లేదు. అందువ‌ల్ల నా భార్య‌, పిల్ల‌ల్ని కూడా ఏడొవొద్ద‌ని చెప్పాను. నేను చ‌నిపోయిన త‌ర్వాత ఎలా బ‌త‌కాలో నా భార్యకు చెప్పి ప్రిపేర్ చేశాను’’ అని అన్నారు పోసాని. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతుంది.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ ‘‘ఒక‌వేళ నేను స‌డెన్‌గా పోయినా నా కుటుంబానికి ఏమీ కాదు. అలా అన్నీ అమ‌ర్చాను. నేను ఎవ‌రినీ మోసం చేయ‌లేదు. అప్ప‌లు కూడా ఏవీ లేవు. ఆస్తుల‌న్నీ మా భార్య పేరు మీద మార్చేశాను. ఇప్ప‌టికే ఆమె పేరు మీద రూ.50 కోట్ల ఆస్తి ఉంది. నెల నెల ఆమెకు రూ.8 ల‌క్ష‌లు నుంచి రూ.9 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఆమె ఏ ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇవ‌న్నీ నా భార్య‌కు చెప్పాను’’ అని పోసాని వీడియోలో తెలిపారు.