English | Telugu

జర్నలిస్ట్‌పై ఫైర్‌ అయిన పూనమ్‌ కౌర్‌.. ‘ఓజీ’ గురించి మాట్లాడినందుకేనా?

సినిమా, రాజకీయాలు.. ఇలా ఏ విషయంలోనైనా తన అభిప్రాయం చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే నటి పూనమ్‌ కౌర్‌. గతంలో ఎన్నో సందర్భాల్లో తన కామెంట్స్‌తో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ దొరికితే ఏదో ఒక విధంగా వారిపై డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో కామెంట్స్‌ పెడుతుంది. అలాంటి ఏ అవకాశం వచ్చినా వదులుకోని పూనమ్‌.. తాజా ‘ఓజీ’ రూపంలో మంచి అవకాశం వచ్చింది. ‘ఓజీ’ ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. దీంతో పవన్‌కళ్యాణ్‌కు అన్నివర్గాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్‌టివి చైర్మన్‌ రవిప్రకాష్‌ చేసిన పోస్ట్‌పై పూనమ్‌ స్పందించి చేసిన కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘మీరు ఎప్పటికీ ఓజీనే. ఎప్పటికీ ప్రజల ఛాంపియన్‌గా ఉంటారు. మీరు సాధించిన విజయానికి, సాధిస్తున్న బిగ్‌ నంబర్స్‌కి అభినందనలు పవన్‌ కళ్యాణ్‌’ అంటూ రవిప్రకాష్‌ ట్వీట్‌ చేయగా దానికి ‘షేమ్‌ ఆన్‌ యు’ అంటూ పూనమ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూనమ్‌ అలా చేయడం వెనుక కారణం ఏమిటి అనేది తెలియలేదు. విషయం అర్థం కాని నెటిజన్లు.. విషయం తెలుసుకునేందుకు అందరికీ అలుపెరుగకుండా మెసేజ్‌లు పెడుతున్నారు. గతంలో చాలా విషయాల్లో తన స్పందన తెలిపిన పూనమ్‌.. ఇప్పుడు రవిప్రకాష్‌ను టార్గెట్‌ చేయడం అందరికీ వింతగా అనిపించింది. దానికి కారణం గతంలో సమంత, నాగచైతన్యలపై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అంశంపై కూడా పూనమ్‌ స్పందించింది. ఆ సమయంలో ఇదే విషయంపై రవిప్రకాష్‌ కామెంట్‌ చేస్తూ ‘‘ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది, ఒక మహిళ అయ్యుండి మరో స్త్రీని అవమానించడం చూస్తుంటే రాజకీయంగా ఎంత దిగజారామో అనిపిస్తోంది’ అంటూ రవిప్రకాష్‌ చేసిన ట్వీట్‌కి పూనమ్‌ స్పందిస్తూ.. నిజం ఏంటో తెలుసుకోకుండా మీరు ప్రసారం చేసే కార్యక్రమాల వల్ల నా జీవితం కూడా నాశనమైంది. ఓ దళిత బిడ్డని బలి పశువుని చేశారు. దయచేసి మీరు నోరు మూసుకుంటే మంచిది’ అంటూ ఎంతో సీరియస్‌గా కామెంట్‌ చేసింది పూనమ్‌.