English | Telugu

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' స్టంట్ రిహార్స‌ల్.. ఫొటోలు వైర‌ల్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'హరిహ‌ర వీర‌మ‌ల్లు'. నిధి అగ‌ర్వాల్ నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇదివ‌ర‌కు కొంత షూటింగ్ జరిగాక, ప‌వ‌న్ క‌ల్యాణ్ 'భీమ్లా నాయ‌క్' సినిమా కోసం విరామ‌మిచ్చారు. తిరిగి శుక్ర‌వారం ఏప్రిల్ 8 నుంచి షూటింగ్ జ‌రిపేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను తీయ‌నున్నారు.

దీని కోసం బ‌ల్గేరియాకు చెందిన స్టంట్‌మ‌న్‌-యాక్ట‌ర్ తోడోర్ లాజ‌రోవ్ ఆధ్వ‌ర్యంలో రిహార్స‌ల్స్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. బ‌ల్లెం, చిరుత క‌ర్ర‌ల‌ను ప‌ట్టుకొని లాజ‌రోవ్‌తో పాటు ప‌వ‌ర్‌స్టార్ చేస్తోన్న స్టంట్ రిహార్స‌ల్స్‌కు సంబంధించిన ఫొటోల‌ను తాజాగా సినిమా అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల‌ను షేర్ చేయ‌డం ఆల‌స్యం.. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

పీరియ‌డ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో బందిపోటు దొంగ వీర‌మ‌ల్లుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ యాక్ట‌ర్లు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌ఖ్రి కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్న ఈ మూవీకి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం, జ్ఞాన‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం స‌మ‌కూరుస్తున్నారు.