English | Telugu

సుజిత్‌కి వరసగా రెండో 100 కోట్ల సినిమా.. కొత్త రికార్డుల వైపు ‘ఓజీ’ పరుగులు!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తోందంటే.. మాస్‌లో విపరీతమైన హంగామా నెలకొంటుంది. అయితే ఈసారి పవన్‌ నుంచి వచ్చిన ‘ఓజీ’కి మరో ప్రత్యేకత తోడైంది. ఈ సినిమా ప్రీ సేల్స్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. అమెరికా, ఇండియా, ఓవర్సీస్‌లలో బుకింగ్స్‌ ఓపెన్‌ అయిన రోజు నుంచి టికెట్లు విపరీతంగా సేల్‌ అయ్యాయి. ప్రతి సెంటర్‌లోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా పవన్‌కళ్యాణ్‌ సినిమాకి భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ట్రేడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్‌ సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్‌ చరిత్రలోనూ అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. స్పెషల్‌ ప్రీమియర్లు, బెనిఫిట్‌ షోలు కలిపి ఈ ఫిగర్స్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

బాక్సాఫీస్‌ వద్ద ఓజీ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. కలెక్షన్ల లెక్కలు చూస్తున్న ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేవు. మొదటిరోజు 100 కోట్లు సాధించడం అనేది పవన్‌కళ్యాణ్‌కే కాదు, సుజిత్‌కి కూడా ఒక రికార్డుగానే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ప్రభాస్‌తో సుజిత్‌ చేసిన సాహో చిత్రం మొదటి రోజులు 100 కోట్లు కలెక్ట్‌ చేసింది. వరసగా రెండోసారి ఫస్ట్‌ డే 100 కోట్ల సినిమా చేసిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో రాజమౌళి ఈ ఘనత సాధించారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ 2, సలార్‌ చిత్రాలకు మొదటి రోజు 100 కోట్లు సాధించిన డైరెక్టర్‌ అనిపించుకున్నారు. లియో, కూలీ చిత్రాలతో లోకేష్‌ కనకరాజ్‌ కూడా తొలి రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పుడు సాహో, ఓజీతో సుజీత్‌ కూడా వారి సరసన చేరారు.

ఒక డైరెక్టర్‌ ఇలా వరసగా 100 కోట్లు సాధించిన రెండు సినిమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు. సినిమాలో ఎంతో విషయం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. స్టార్‌ హీరోలైనా, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసినా అందరు డైరెక్టర్లకు ఇది కుదరదు. ఓజీ విషయానికి వస్తే ప్రీ సేల్స్‌, మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ ఈ రికార్డు సాధించడానికి కారణమయ్యాయి. ఈ సంవత్సరం విడుదలైన తెలుగు సినిమాల్లో భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా ఓజీకి ఒక ప్రత్యేక స్థానం దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సినిమాకి వినిపిస్తున్న టాక్‌ చూస్తుంటే లాంగ్‌ రన్‌లో కూడా భారీగానే వసూళ్ళు రాబడుతుందని అర్థమవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఇంతటి భారీ కలెక్షన్లు సాధిస్తున్న సినిమా మరొకటి లేదు. కలెక్షన్‌ ట్రెండ్‌ని బట్టి టాలీవుడ్‌ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్‌గా ఓజీ నిలిచే అవకాశం కనిపిస్తోంది.