English | Telugu

'అంటే సుంద‌రానికీ'.. న‌జ్రియా ఇలా డ‌బ్బింగ్ చెప్పింది.. వైర‌ల్ అవుతున్న వీడియో!

నాని హీరోగా డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ రూపొందించిన‌ 'అంటే సుంద‌రానికీ!' సినిమా ద్వారా మ‌ల‌యాళం న‌టి న‌జ్రియా న‌జీమ్ నాయిక‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌వుతోంది. జూన్ 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగా ఈ మూవీకి త‌నెలా డ‌బ్బింగ్ చెప్పిందో ఓ ఫ‌న్ వీడియో ద్వారా షేర్ చేసింది న‌జ్రియా. "నా ఫ‌స్ట్ తెలుగు ఫిల్మ్ కోసం నేను చెప్పిన డ‌బ్బింగ్ ఇలా ఉంది" అంటూ దానికి కాప్ష‌న్ పెట్టిందామె. ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఎస్త‌ర్ అనీల్ ('దృశ్యం' ఫేమ్‌), ప‌ద్మ‌సూర్య లాంటి సెల‌బ్రిటీలు ఈ వీడియోకు కామెంట్లు పెట్టారు. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సంచ‌ల‌న తార‌గా పేరు తెచ్చుకున్న అన్నా బెన్‌, "డ‌బ్బింగ్ అనేది ఇంత‌టి ఫ‌న్ ఇస్తుంద‌ని ఇప్ప‌టిదాకా నాకు తెలీదు' అని కామెంట్ చేసింది.

న‌జ్రియా ఎవ‌రో కాదు.. 'పుష్ప' మూవీలో క్లైమాక్స్‌లో విల‌న్‌గా క‌నిపించి, ఇప్పుడు 'పుష్ప 2'లో మెయిన్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఫ‌హ‌ద్ ఫాజిల్ భార్య‌. పెళ్లి త‌ర్వాత కొంత కాలం సినిమాల‌కు విరామ‌మిచ్చిన ఆమె, ఇప్పుడు 'అంటే సుంద‌రానికీ' ద్వారా హీరోయిన్‌గా మ‌న ముందుకు వ‌స్తోంది.

ఈ మూవీలో ఆమె లీల అనే క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. బ్రాహ్మ‌ణ కుర్రాడు సుంద‌ర్‌తో ఆమె ప్రేమ‌లో ప‌డుతుంది. ఆచార వ్య‌వ‌హారాల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిచ్చే కుటుంబంలో పుట్టిన సుంద‌ర్ త‌న ప్రేమ‌ను గెలిపించ‌డం కోసం ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడో ఈ రొమాంటిక్ కామెడీలో స‌ర‌దాగా చూపించాడు ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఏప్రిల్‌లో విడుద‌ల చేసిన టీజ‌ర్ ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ చేసింది.