English | Telugu
ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబు: దాసరి
Updated : Mar 21, 2014
మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన "రౌడీ" చిత్ర పాటల విడుదల కార్యక్రమం నిన్న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో అత్యంత వైభవంగా జరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎవి. పిక్చర్స్ బ్యానర్లో విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు, పార్థసారథి సంయుక్తంగా నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. పూరీ సంగీత్ ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్న ఈ ఆడియోను దాసరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ... "మోహన్ బాబు వంటి శిష్యుడు ఉండడం నా అదృష్టం. అతను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ద్వారా అతను సాధిస్తున్న ఖ్యాతి అజరామరం. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు చూసాను. మోహన్ బాబు అద్భుతంగా నటించాడు. అతడిని నేను చూపించలేని విధంగా వర్మ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి నటుడు మోహన్ బాబు. ఈ సినిమాలో కొన్ని సీన్స్, రెండు పాటలు చూసి ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను సొంతం చేసుకొన్నాను. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది" అని అన్నారు.