English | Telugu
వర్మ ది బెస్ట్ డైరెక్టర్ : మోహన్ బాబు
Updated : Mar 21, 2014
మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన "రౌడీ" చిత్ర పాటల విడుదల కార్యక్రమం నిన్న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో అత్యంత వైభవంగా జరిగింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎవి. పిక్చర్స్ బ్యానర్లో విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు, పార్థసారథి సంయుక్తంగా నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు ప్రత్యేక అతిధులుగా విచ్చేసారు. పూరీ సంగీత్ ద్వారా మార్కెట్ లో లభ్యం కానున్న ఈ ఆడియోను దాసరి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... "అప్పట్లో దాసరి గారు నన్ను కాలితో తన్ని డైలాగులు నేర్పించేవారు. అటువంటి దర్శకుల వల్లే నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. దాసరి గారు, రాఘవేంద్రరావు గారి తర్వాత నేను చూసిన, పనిచేసిన ది బెస్ట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. కానీ నేను వర్మ దర్శకత్వంలో చేస్తున్నాను అనగానే అందరిలో కూడా "వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు విడిపోతారు?" అనే ఆతృత తప్ప... వీరిద్దరూ కలిస్తే ఓ మంచి సినిమా వస్తుందన్న మంచి ఆలోచన ఎవరిలోనూ రాలేదు. ఈ చిత్రంలో నటించాక నా వయసు ఓ పది సంవత్సరాలు పెరిగింది. వర్మ ఈ చిత్రాన్ని అధ్బుతంగా తీర్చిదిద్దాడు" అని అన్నారు.