English | Telugu
ఆస్కార్‌కు కమల్‌హాసన్.. యూనివర్సల్ స్టార్‌కు దక్కిన అరుదైన గౌరవం!
Updated : Jun 27, 2025
ప్రపంచ సినిమాలో ప్రతి నటుడూ, సాంకేతిక నిపుణుడు ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. ఆస్కార్ సాధించడమే తమ లక్ష్యంగా పనిచేస్తారు. 1929 మే 16న ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ఆస్కార్ అవార్డుల ప్రక్రియను ప్రారంభించింది. మరో నాలుగు సంవత్సరాల్లో వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది ఆస్కార్. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ప్రపంచ సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని సినీ ప్రముఖులంతా ఆ వేడుకలో ప్రేక్షకులకు కనువిందు చేస్తారు. అందుకే ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండువగా జరుగుతుంది. ఈ ఏడాది మార్చి 2న ఆస్కార్ వేడుక జరిగింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు.
ప్రతి సంవత్సరం ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాల నుంచి ఫైనల్ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రముఖులను ఆహ్వానిస్తారు. నామినేటెడ్ సినిమాలను ఫైనల్‌గా ఎంపిక చేసేందుకు వీరంతా ఓటు చేస్తారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కొందరు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆహ్వానం అందుకున్న వారిలో యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు ఉన్నారు. వీరంతా గ్లోబల్ క్లబ్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు పొందిన వారి జాబితాను ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసింది.
ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుక కోసం సినీ ప్రముఖులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. అందుకే ఈ ఏడాది కొత్తగా 534 మంది సభ్యులను ఈ పురస్కారాలకు ఆహ్వానించారు. 19 ఇతర విభాగాల్లోని నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలను అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఈ సంవత్సం చోటు దక్కించుకున్న వారిలో 44 శాతం మహిళలే ఉన్నట్టుగా తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేట్ అయిన అన్ని సినిమాలను పరిశీలించి 2026 జనవరి 22న తుది జాబితాను ప్రకటిస్తారు.