English | Telugu
ఎన్టీఆర్ చేయాల్సిన 'ఖైదీ నెం.150' చిరంజీవి చేశాడు!
Updated : Jan 22, 2023
రాజకీయాల కోసం కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి 2017 లో విడుదలైన 'ఖైదీ నెం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్. చిరు రీఎంట్రీ ఫిల్మ్ గా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉందట. ఈ విషయాన్ని తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని రివీల్ చేశాడు.
ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' చిత్రంతో అలరించిన మలినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని అన్నాడు. తమిళ్ మూవీ 'కత్తి'ని తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తన దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకున్నామని మలినేని చెప్పాడు. ఎన్టీఆర్ కూడా ఆ సినిమా పట్ల ఆసక్తి చూపించారని, కానీ విజయ్ మొదట 'కత్తి'ని తెలుగులో డబ్ చేయాలనుకోవడం, మరోవైపు ఆ చిత్రంతోనే చిరంజీవి రీఎంట్రీ ఇవ్వాలనుకోవడం వంటి కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదని మలినేని చెప్పుకొచ్చాడు. కాగా, 2015లో 'కత్తి' రీమేక్ లో ఎన్టీఆర్ నటించనున్నాడు అంటూ వార్తలు రావడం విశేషం.
అంతేకాదు కత్తి రీమేక్ మిస్ అయ్యాక, తర్వాత దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడం కోసం.. ఎన్టీఆర్ కి మలినేని ఒక కథ వినిపించగా.. మరీ వైలెన్స్ ఎక్కువైందని, తనతో(మలినేనితో) ఓ మంచి ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఎన్టీఆర్ ఆ కథని పక్కన పెట్టేశాడట. అలా 2016-17 సమయంలో ఎన్టీఆర్-మలినేని కలయికలో రావాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి భవిష్యత్ లో ఏమైనా సాధ్యమవుతుందేమో చూడాలి.