English | Telugu
'రౌడీ జనార్దన్' ప్రోమో.. అందరికీ చెప్పాల్సిన కథ ఇది!
Updated : Dec 18, 2025
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మిస్తున్న క్రేజీ మూవీ SVC59. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను డిసెంబర్ 22న సాయంత్రం 7.29 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తన మదిలో రూపుదిద్దుకున్న హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్ కోలా. "ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా.. ఒక మనిషి గురించి. నా జ్ఞాపకాల్లో అతను ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా. అతన్ని ఎంత ద్వేషించానో.. అంతకంటే ఎక్కువ ప్రేమించాను. అతనిది అందరికీ చెప్పాల్సిన కథ. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను" అంటూ రిలీజ్ చేసిన డైరెక్టర్స్ నోట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రక్తం కారుతున్న హీరో విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ ఈ ప్రోమోను ముగించడం ఆసక్తి కలిగిస్తోంది. (Rowdy Janardhan)
కాగా, ఈ సినిమాకి 'రౌడీ జనార్దన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు గతంలో దిల్ రాజు తెలిపారు. డిసెంబర్ 22న ఆ టైటిల్ ని అఫీషియల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.
'రౌడీ జనార్దన్'పై మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టి ఉంది. తాజాగా విడుదలైన డైరెక్టర్స్ నోట్ ప్రోమో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది అనడంలో సందేహం లేదు.