English | Telugu

ఈసారైనా గుణశేఖర్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా?

టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్లలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న దర్శకుడు గుణశేఖర్‌. అందరూ పిల్లలతో రామాయణం చిత్రాన్ని తెరకెక్కించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పురాణ ఇతిహాసాల్లో అతనికి ఉన్న పరిజ్ఞానం ఏమిటో ఆ సినిమాతో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మహేష్‌తో చేసిన ఒక్కడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మహేష్‌ని స్టార్‌ హీరోని చేసింది. ఆ తర్వాత మహేష్‌తోనే చేసిన అర్జున్‌ చిత్రం ఫర్వాలేదు అనిపించినా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.

ఒక డిఫరెంట్‌ జోనర్‌లో గుణశేఖర్‌ చేసిన సొగసు చూడతరమా చిత్రానికి ఇప్పటికీ ఆదరణ ఉంది. ఒక దశలో గుణశేఖర్‌ ఏ సినిమా చేసినా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. అందుకే తనే సొంతంగా అనుష్క ప్రధాన పాత్రలో రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించారు. అప్పటికే అరుంధతి వంటి బ్లాక్‌ బస్టర్‌ చేయడం వల్ల అనుష్క ఇమేజ్‌ ఈ సినిమాకి ఉపయోగపడింది. భారీ విజయాన్ని అందుకోకపోయినా రుద్రమదేవి ఓకే అనిపించుకుంది.

రుద్రమదేవి తర్వాత మరో సినిమా తియ్యని గుణశేఖర్‌.. ఎనిమిదేళ్ళ గ్యాప్‌ తర్వాత సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం సాధించలేదు. శాకుంతలం విడుదలై రెండు సంవత్సరాలవుతోంది. ఆమధ్య యుఫోరియా అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు గుణశేఖర్‌. యంగ్‌ టీమ్‌తో ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

యుఫోరియాలో భూమిక, సారా అర్జున్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొదటిసారి ఒక థ్రిల్లర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు గుణశేఖర్‌. ప్రస్తుత ప్రేక్షకుల టేస్ట్‌ని బట్టి ఇలాంటి కథాంశం ఎనుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. చాలా కాలంగా హిట్‌ లేని గుణశేఖర్‌ ఒక సాలిడ్‌ హిట్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక థ్రిల్లర్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గుణశేఖర్‌ ప్లాన్‌ ఈసారైనా వర్కవుట్‌ అవుతుందా? ఒక బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వస్తాడా అనేది చూడాలి.