English | Telugu

థియేటర్లలో నేడు 5 సినిమాలు

ప్రజలు రాజకీయ గొడవలతో అల్లాడుతుంటే వారికి కాస్త వినోదాన్ని పంచడానికి నేడు(మార్చి 21) ప్రేక్షకుల ముందుకు 5 సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.. మిగిలిన మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు.

శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం "వేట". తేజ సినిమా బ్యానర్లో నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ అల్లే దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు.

నవకేష్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "గీత". కొమ్మి శివరామయ్య సమర్పణలో కొమ్మి కౌశల్యదేవి నిర్మించిన ఈ చిత్రానికి రామారావు ఏలేటి దర్శకత్వం వహించారు. వేదకాలం నాటి అంశాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యలను ఎలా రూపుమాపాలో ఈ చిత్రంలో చూపించారు. పద్మనావ్ సంగీతం అందించారు.

అజిత్, తమన్నా జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ "వీరం" చిత్రాన్ని తెలుగులో వీరుడోక్కడే పేరుతో డబ్బింగ్ చేసారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తమిళంలో 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ప్రముఖ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు, సురభి జంటగా నటించిన తాజా చిత్రాన్ని తెలుగులో "సిటిజన్" పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం బి, సురేష్ ఎన్, ఎన్ సుభాష్ చంద్రబోస్ సంయుక్తంగా నిర్మించారు. రౌడీయిజంపై ఓ సామాన్య పౌరుడు ఎలా పోరాటం సాగించాడన్నది ఈ సినిమా సారాంశం.

అశోక్ సెల్వన్, జనని జంటగా నటించిన చిత్రం "భద్రమ్". శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నివాస్ సంగీతం అందించారు. ఈ 5 చిత్రాలు ఎలాంటి విజయం దక్కించుకుంటాయో మరికొద్ది గంటల్లో తెలియనుంది.