English | Telugu

నాని, సుజిత్‌ మూవీలో విలన్‌గా మరో స్టార్‌ హీరో!

2014లో శర్వానంద్‌ హీరోగా యువి క్రియేషన్స్‌ నిర్మించిన ‘రన్‌ రాజా రన్‌’తో దర్శకుడిగా పరిచయమైన సుజిత్‌.. తొలి సినిమాతోనే ఘనవిజయం సాధించాడు. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 34 కోట్లు కలెక్ట్‌ చేసింది. 2019లో ప్రభాస్‌తో రూపొందించిన ‘సాహో’తో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిపోయాడు. తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ బాలీవుడ్‌లో మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజే 100 కోట్లు కలెక్ట్‌ చేసింది. తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో చేసిన ‘ఓజీ’ కూడా తొలిరోజు 100 కోట్లు సాధించింది. ఇలా వరుసగా రెండు సినిమాలతో ఫస్ట్‌ డే రూ.100 కోట్లు రాబట్టిన రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, లోకేష్‌ కనగరాజ్‌ల సరసన చేరాడు సుజిత్‌. నాలుగురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 252 కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. సుజిత్‌ నెక్స్‌ట్‌ చేయబోయే సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. నేచురల్‌ స్టార్‌ నానితో నెక్స్‌ట్‌ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే సుజిత్‌ ప్రకటించాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే న్యూస్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో నానికి విలన్‌గా మలయాళ స్టార్‌ హీరో, డైరెక్టర్‌ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ నటించబోతున్నాడని తెలుస్తోంది. అతనికి సుజిత్‌ కథ వినిపించడం, ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని సమాచారం. ‘ఓజీ’కి ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించాడో ఈ సినిమాకి కూడా దాన్నే ఫాలో అవుతున్నాడని ఈ న్యూస్‌ గురించి తెలిసిన వారు అంటున్నారు.

బాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్‌ హష్మీని తెలుగులో విలన్‌గా పరిచయం చెయ్యాలన్న ఆలోచన సుజిత్‌కి రావడం, ఇమ్రాన్‌ కూడా తన స్టైలిష్‌ పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకోవడం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. బాలీవుడ్‌ హీరోని టాలీవుడ్‌లో విలన్‌గా చూపించి మంచి సక్సెస్‌ సాధించిన సుజిత్‌.. ఇప్పుడు మలయాళ హీరోని విలన్‌గా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. నటుడిగా, దర్శకుడిగా పృథ్విరాజ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రభాస్‌తో కలిసి చేసిన సలార్‌తో అతను మరింత పాపులర్‌ అయ్యాడు. ఆల్రెడీ మహేష్‌, రాజమౌళి సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న పృథ్విరాజ్‌.. నాని, సుజిత్‌ కాంబినేషన్‌లో చేసే సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.