Read more!

English | Telugu

దిల్ రాజు లక్ లెక్క తప్పుతుందా!

తెలుగులో నిన్నటి వరకు సినిమాల జడ్జిమెంట్ లో దిల్ రాజుకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ఆయన ఓ చిత్రాన్ని తీస్తున్న లేదా  కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్న అందులో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుందని ప్రేక్షకులలో ఒక సదాభిప్రాయం, పాజిటివ్ నెస్  ఉండేవి. అందుకు తగ్గట్టుగానే ఆయన చిత్రాలు కూడా బంధాలు, అనుబంధాల చుట్టూ సాగుతూ ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో త‌న‌దైన  శైలిలో ఆకట్టుకుంటూ వచ్చాయి. ఈయన సుకుమార్ ను  ఆర్య చిత్రంతో, భద్ర మూవీ తో బోయపాటి శ్రీను ని, మున్నాతో వంశీ పైడిపల్లిని, బొమ్మరిల్లుతో భాస్కర్ ను, కొత్త బంగారులోకంతో శ్రీకాంత్ అడ్డాల‌ను ..... ఇలా ఎంతో మంది దర్శకులు పరిచయం చేశారు. అలా పరిచయం చేసిన దర్శకుల్లో చాలామంది ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఒకనాడు దిల్ రాజు సినిమా అంటే కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూసి ఆనందించే చిత్రం అనే అభిప్రాయం ప్రేక్షకుడిలో ఉండేది.

బొమ్మరిల్లు, బృందావనం, శతమానం భవతి, ఫిదా వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలను దిల్ రాజు తీశారు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ ను సరిగా తీస్తే ఒక శతమానం భవతి అవుతుంది. అది కాస్త శృతి  మించితే శ్రీనివాస కళ్యాణమవుతుందని కొందరు సెటైర్లు విసురుతున్నారు. ఇక వారసుడు చిత్రంతో మరోసారి దిల్ రాజు  మరో మూస కథను నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా యావ‌రేజ్ దిశగా నడుస్తోంది. ఈ మధ్యకాలంలో దిల్ రాజు  టేస్టు పూర్తిగా మారిపోయింది. ఆయన జడ్జిమెంట్ తప్పిపోతోంది. ఆయనపై నమ్మకం అందరిలో సన్న‌గిల్లుతోంది. దిల్ రాజు చిత్రాలు అంటే పాత చింతకాయ పచ్చడి లాంటి చిత్రాలనే భావన ప్రేక్షకుల్లో బలంగా నాటుకుంటుంది. ఆయన టేస్ట్ ప్రస్తుతం ఏమాత్రం సరిగా లేదు. గత నాలుగేళ్లలో ఆయనకు ఎఫ్2 చిత్రం తప్ప మరో మంచి చిత్రం లేదు. వకీల్ సాబ్ సినిమాకి హిట్ టాక్ వ‌చ్చినా  కలెక్షన్స్ ఆ రేంజ్ లో  రాలేదు. మిగిలినవి చిత్రాలు కూడా ఏమాత్రం కూడా అలరించలేకపోయాయి.

ఈసారి ఏకంగా ఆయన 250 కోట్ల బడ్జెట్‌తో ఏకంగా విజయ్ కే 100 కోట్ల పారితోషకం ఇచ్చి తమిళ్లో వారీసు తెలుగులో వారసుడు  తీశారు.  కానీ ఇది  రెండు భాషల్లోనూ యావ‌రేజ్ టాక్  తెచ్చుకుంది. ఈ చిత్రంతో పాటు ఆయ‌న గ‌త  చిత్రాలు కూడా నష్టాలను మిగిల్చాయి. కానీ నష్టాలు ఈయనకు పెద్దగా కష్టాలుగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ముందుగానే తెలివిగా తన చిత్రాల థియేటిక‌ల్ రైట్స్ ని  అమ్మేసుకుంటూ తాను మాత్రం సేఫ్‌గా బయటపడుతున్నారు. కానీ ఆయా చిత్రాలను కొన్న‌వారు మాత్రం న‌ష్టాల బారిన పడుతున్నారు. ఇకపై దిల్ రాజు సినిమాలను బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి సినిమాను కొనే  అవకాశం లేదని కొందరు ట్రేడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.