Read more!

English | Telugu

‘రాంగీ’ మూవీ రివ్యూ

సినిమా : 'రాంగీ' 
తారాగణం: త్రిష, అనశ్వర రాజన్, బెక్జోడ్ అబ్దుమాలికోవ్, లిజ్జీ ఆంటోని, జాన్ మహేంద్రన్, గోపీ కన్నదాసన్, వకార్ ఖాన్... తదితరులు.
కథ: ఏఆర్. మురగదాస్
సినిమాటోగ్రఫీ: కెఎ శక్తివేల్
సంగీతం: సి. సత్య
ఎడిటింగ్: ఎం సుభారక్
డైరెక్టర్ : ఎం. శరవణన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: అల్లిరాజా సుభాస్కరన్.
ఓటిటి : నెట్ ఫ్లిక్స్

కథ: 
శివంగి.. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో‌ రిపోర్టర్ గా చేస్తుంటుంది. తను వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. ఆ అన్నయ్యకు సుష్మిత అనే కూతురు ఉంటుంది. సుష్మిత పేరు మీద ఆమె క్లాస్ మేట్ ఒక ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫ్రొఫైల్ లో తన బాడీని నగ్నంగా వీడియోలు తీసి.. సుష్మిత ఫేస్ తో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయి కనిపిస్తే ఛాట్ చేద్దాం అనే బ్యాచ్ అంతా మెసేజ్ లు, వీడీయో కాల్స్ చేయడం మొదలుపెడతారు.‌ అందులో ఒకతను సుష్మిత వాళ్ళ నాన్నకి సుష్మిత నగ్న వీడియోలు పంపిస్తాడు. అది చూసి సుష్మిత వాళ్ళ నాన్న కుమిలిపోతాడు. ఈ విషయం గురించి శివంగికి చెప్తాడు. శివంగి ఇన్వెస్టిగేషన్ చేసి అందరినీ పట్టుకొని అదొక ఫేక్ ప్రొఫైల్ అని... ఆమెకు మీరెవరో తెలియదని, అసలు తనకి ఫేస్ బుక్ లేదని... వాళ్ళని మారమని చెప్పి వదిలేస్తుంది. ఇక అందరిని బ్లాక్ చేసి ఆ ఫ్రొఫైల్ ని క్లోజ్ చేద్దామని శివంగి అనుకున్నప్పుడు... ఆలీమ్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. రష్యాలోని తీవ్రవాద గూఢాచారులలో ఒకడైన ఆలీమ్.. సుష్మితతో ఛాటింగ్ చేస్తుంటాడు. అయితే సుష్మిత అనుకొని ఆలీమ్ చాటింగ్ చేస్తాడు. సుష్మితగా శివంగి ఈ చాటింగ్ లో ఆలీమ్ తో ప్రేమగా మాట్లాడుతూ.‌. తన టీవీ పబ్లిసిటీ కోసం ఒక ఫోటోని లీక్ చేస్తుంది. దీంతో  FBI కి ఆలీమ్ ఒక రష్యా తీవ్రవాది అని తెలిసిపోతుంది. ఆ తర్వాత శివంగిని FBI టీం బంధించి ఇంటారాగేట్ చేస్తుంటారు. అయితే ఈ ఇంటారాగేషన్ లో  తీవ్రవాది అయిన ఆలీమ్ ని FBI పట్టుకుందా? సుష్మిత ప్రేమను ఆలీమ్ పొందగలిగాడా? ఆలీమ్, శివంగిల మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ :
సినిమా ఓపెనింగ్ సీన్ FBI బృందం, శివంగిని పట్టుకునే సీన్ తో మొదలవుతుంది. ఆలీమ్ ఎలా తెలుసు? ఎవరు నువ్వు అంటూ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ తర్వాత కథలో ఫ్లాష్ బ్యాక్ లో శివంగి న్యూస్ రిపోర్టర్ గా చూపిస్తూ గతాన్ని తెలిపే సీన్ బాగుంటుంది. అన్నీ తెలిసిన ఒక రిపోర్టర్ శివంగి.. తీవ్రవాదిని ప్రేమిస్తున్నట్టుగా చాట్ చేయడం అనేది చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ కనిపిస్తే తప్పుగా ఆలోచించే మగాళ్ళు ఎందరో ఉన్నారంటూ చూపించిన తీరు బాగుంది. కానీ అలా చేయడం తప్పు అని చెప్పిన శివంగి చాటింగ్ చేయడమనేది ఎంత వరకు కరెక్ట్ అనేది డైరెక్టర్ కే తెలిసి ఉండాలి‌. ఇక FBI ని ఒక సాదాసీదా పోలీసులుగా చూపించారు. వారిని మరింత స్ట్రాంగ్ గా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో ఎంతసేపు ప్రేమ చుట్టూ కథని నడిపించాడు డైరెక్టర్.

తీవ్రవాదిలో కూడా స్వఛ్ఛమైన మనసు ఉంటుందంటూ... ప్రేమ కథని రూపొందించిన తీరు బాగుంది. కానీ ఒకవైపు చంపుతూ.. మరోవైపు ప్రేమించడం అనేది కామన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. కథని మొదట థ్రిల్లర్ గా మొదలుపెట్టి మధ్యలో ఎంటర్‌టైన్మెంట్ జోడించడం.. ఆ తర్వాత లవ్ ట్రాక్.. ఇలా నెమ్మదిగా సాగింది. ఈ సినిమా ఫ్యామిలీ, కామెడీ, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడు డైరెక్టర్. FBI ఏజెంట్స్ దేశం కోసం తీవ్రవాదులను హతమార్చే సీన్స్ బాగున్నాయి. ఇక న్యూస్ రిపోర్టర్ గా మొదట ఎంతటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయాలి అనే పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్.

సి. సత్య స్వరపరిచిన నేపథ్య సంగీతం బాగుంది. కెఎ శక్తివేల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ఎం సుబారక్ ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ని కట్ చేస్తే బాగుండేది. మురగదాస్ రాసిన కథ బాగుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు: 
శివంగి పాత్రలో త్రిష ఒదిగిపోయింది. ఆలీమ్ పాత్రలో బెక్జోడ్ అబ్దుమాలికోవ్  ఆకట్టుకున్నాడు. ఇక సుష్మిత పాత్రలో అమాయకపు ఆడపిల్లలా అనశ్వర రాజన్ ఉన్నంత మేరకు పర్వాలేదనిపించింది. 

తెలుగువన్ పర్ స్పెక్టివ్: 
ప్రేమకు భాషతో సంబంధం లేదని నిరూపిస్తూ తీసిన ఈ ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోలేకపోయింది.  ఈ థ్రిల్లింగ్ ప్రేమ కథ 'రాంగీ' ని ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2 /5


✍🏻. దాసరి మల్లేశ్