English | Telugu
కానిస్టేబుల్ మూవీ రివ్యూ
Updated : Oct 11, 2025
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మించిన ఈ మూవీ తాజాగా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ సందేశ్ కి ఊరటని ఇచ్చిందా? అన్నది రివ్యూలో చూద్దాం.
కథ:
శంకరపల్లిలో సీరియల్ కిల్లర్ చెలరేగిపోతోంటాడు. ఆ ఊరిలో ఆడ, మగ అన్న తేడా లేకుండా వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసుని ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది. అక్కడి లోకల్ పోలీస్ స్టేషన్‌లోనే కాశీ (వరుణ్ సందేశ్) కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ కత్తికి కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. దీంతో ఈ కేసుని మరింత పర్సనల్‌గా తీసుకుంటాడు కాశీ. ఈ మేరకు చేసిన విచారణలో కాశీ తెలుసుకున్నది ఏంటి? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యలకు కారణమేంటి? ఈ కేసుని కాశీ ఎలా సాల్వ్ చేశాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
క్రైమ్ కథలను ఇష్టపడే ప్రేక్షకులు బాగానే ఉంటారు. ఇలాంటి క్రైమ్ స్టోరీలు ఎక్కువగా సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను కలిగిస్తాయి. అందుకే మేకర్స్ ఎక్కువగా ఇలాంటి క్రైమ్ కథల్ని ఎంచుకుంటారు. క్రైమ్ జరిగే తీరు, ఆ నేపథ్యాన్ని కొత్తగా చూపిస్తే సినిమా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ విషయంలో ఆ కొత్తదనం కనిపిస్తుంది.
క్రైమ్ జానర్ కి తగ్గట్టుగా తరువాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ కథనాన్ని నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మర్డర్స్ జరిగే తీరుని చూపించారు. అసలు కిల్లర్ ఎవరు? అన్నది దాచి పెట్టి సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. ఆ తరువాత సెకండాఫ్ అంతా కూడా కేసుని ఛేదించే క్రమంలో కాశీ చేసే ప్రయత్నాల్ని చూపించారు. చివరకు ఎవ్వరూ ఊహించని విలన్‌ను తెరపైకి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్ లు ఆడియన్స్ కి కిక్ ఇస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
కానిస్టేబుల్ కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ కొత్తగా కనిపించాడు. లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. హీరోయిన్‌గా మధులిక పాత్ర పర్వాలేదనిపిస్తుంది. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఓ మోస్తరుగా మెప్పిస్తాయి. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఇలాంటి చిత్రాలకు సాంకేతిక బృందం సరిగ్గా సపోర్ట్ చేస్తే అవుట్ పుట్ మెరుగ్గా ఉంటుంది. కానిస్టేబుల్ విషయంలో సాంకేతిక బృందం సహకారం బాగానే ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. షేక్ హజారా కెమెరా పనితనం కూడా మెప్పించింది. సినిమా టోన్ కి తగ్గట్టుగా ఫ్రేమింగ్, లైటింగ్, కలర్ పాటర్న్ ఉన్నాయి. మాటలు, పాటలు ఓకే అనిపిస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా:
ప్రయత్నం బాగుంది. క్రైమ్ స్టోరీలను ఇష్టపడే వారికి నచ్చుతుంది.
రేటింగ్: 2.75