English | Telugu

జర్నీ సినిమాని గుర్తు చేస్తున్న వరుస బస్సు ప్రమాదాలు!

ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కర్నూల్ జిల్లాలో బైక్ ను ఢీకొని ఒక ప్రైవేట్ బస్సు ఆగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చేవెళ్ళలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. (Chevella Bus Accident)

సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో బస్సు జర్నీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఈ ప్రమాదాలు 'జర్నీ' సినిమాని గుర్తు చేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.

జర్నీ సినిమాలో అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా రెండు బస్సులు ఘోర ప్రమాదానికి గురవుతాయి. ఎన్నో ఆశలు, కలలతో బస్సు ఎక్కిన పలువురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతాయి. మరికొందరు అయినవాళ్ళను పోగొట్టుకొని ఎవరూ తీర్చలేని వేదనను అనుభవిస్తారు.

జర్నీ సినిమాలోని ఆ యాక్సిడెంట్ సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. కేవలం సినిమాలోని సన్నివేశాలే అంత బాధ కలిగిస్తే.. ఇక నిజ జీవితంలో ఆ ప్రమాదం ఎంతటి బాధను కలిగిస్తుందో మాటల్లో వర్ణించడం కష్టం.

కర్నూల్, చేవెళ్ళలో జరిగిన ఈ ఘోర ప్రమాదాలు అందులో మృతి చెందిన వారి కుటుంబాలకే కాదు.. అందరికీ బాధను కలిగిస్తున్నాయి. అతివేగం ప్రమాదకరం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.