English | Telugu
పవన్ పై దారుణ కామెంట్స్.. పోసానిపై కేసు నమోదు!
Updated : Sep 29, 2021
పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. 'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. పోసాని ప్రెస్ మీట్ పెట్టి విరుచుకుపడ్డారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత పవన్ ఫ్యాన్స్ కొందరు పోసాని కుటుంబాన్ని దూషిస్తూ అసభ్యకర మెసేజ్ పెట్టారట. దీంతో మంగళవారం మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. పవన్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసైనికులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్ సైకో ఫ్యాన్ తన భార్యను ఉద్దేశిస్తూ అసభ్యకర మెసేజ్ పెట్టాడని తెలిపిన పోసాని.. పవన్ భార్యని ఉద్దేశిస్తూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఆ వ్యాఖ్యలు పవన్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. పవన్ ఫ్యాన్స్ చేసిన తప్పుకు.. ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్.. పోసానిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పవన్ తో పాటు ఆయన కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు కాపీని ఎస్ఐ కౌశిక్ కు అందించారు. అంతేకాకుండా పోసానిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. పోసాని వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని.. ఆయన ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే మంగళవారం ప్రెస్‌మీట్ అనంతరం పోసానిపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నించారట. తనకు పవన్ అభిమానుల వల్ల ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే ఆయనే బాధ్యత వహించాలన్నారు. అంతే కాకుండా తాను కూడా పవన్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు.